నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 28 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు ఆదివారం ఉత్సాహంగా జరుపుకొన్నారు. శనివారం రాత్రి కామదహనం కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకొన్నారు.బాన్సువాడ మండలంలో బోర్లం, బోర్లం క్యాంపు, ఇబ్రహీంపేట్, హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్ చిన్నరాంపూర్ తదితర గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. యువకులు బృందంగా ఏర్పడి గ్రామంలో పర్యటిస్తూ నృత్యాలు చేస్తూ సంబురాల్లో పాల్గొన్నారు.
బోర్లంక్యాంప్ తండాలో గిరిజన మహిళలు హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. సంప్రదాయ నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ పండుగను జరుపుకొన్నారు. గాంధారి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఆదివారం రాత్రి కామదహన కార్యక్రమాలను నిర్వహించారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో, అంకోల్ గ్రామంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి, బీర్కూర్, కిష్టాపూర్, చించోలి తదితర గ్రామాల్లో హోలీని ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో చతుర్దశి కామదహనంతో హోలీ సంబురాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని కామునికంత వద్ద చతుర్దశి కామదహన కార్యక్రమాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. వేదపండితుడు ప్రణయ్శర్మ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించి కామదహనం ప్రారంభించారు. ఆదివారం రాత్రి పున్నమి కామదహనం నిర్వహించగా.. సోమవారం హోలీ పండుగ సంబురాలను నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
బిచ్కుందలో నేడు హోలీ
మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం హోలీ వేడుకలను నిర్వహించనున్నట్లు గ్రామపెద్దలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం రాత్రి కామదహనం నిర్వహించారు.
ఇవీ కూడా చదవండి..
నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌కు కరోనా వ్యాక్సిన్