e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home కామారెడ్డి కరోనా కట్టడికి ‘సూపర్‌' ప్లాన్‌

కరోనా కట్టడికి ‘సూపర్‌’ ప్లాన్‌

కరోనా కట్టడికి ‘సూపర్‌' ప్లాన్‌

జనసమూహంలో కలియ తిరిగే వర్గాలకు వ్యాక్సినేషన్‌
ప్రత్యేక కేంద్రాల్లో సూపర్‌ స్ప్రెడర్లకు కరోనా టీకాలు
ఉమ్మడి జిల్లాలో 10వేల మంది గుర్తింపు
కామారెడ్డిలో 24, నిజామాబాద్‌లో 18 కేంద్రాలు ఏర్పాటు
పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం

నిజామాబాద్‌, మే 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. వైరస్‌ వ్యాప్తిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలను అమలు చేస్తున్నది.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకంలో వైద్యారోగ్య శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చర్యలు చేపడుతున్నది. కరోనా వ్యాప్తికి మూలాల కట్టడికి చర్యలు తీసుకుంటూ మిగిలిన రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే ఇంటింటి సర్వేతో తెలంగాణ రాష్ర్టానికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కింది. ఈ ప్రయత్నాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్నారు. మిగిలిన రాష్ర్టాలు సైతం జ్వర సర్వే పేరిట ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న చర్యకు సిద్ధమైంది. జన బాహుళ్య ప్రదేశాల్లో సంచరించే ఆయా వర్గాలను గుర్తించి వారికి తక్షణమే కరోనా టీకాలు అందించాలని నిర్ణయం తీసుకున్నది. తద్వార క్షేత్ర స్థాయిలో కరోనా వ్యాప్తిని వేగంగా తగ్గించవచ్చని సర్కారు యోచిస్తున్నది. ఇందులో భాగంగా శుక్ర, శనివారాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 42 టీకా కేంద్రాల్లో 10వేల మందికి వ్యాక్సిన్‌ అందించనున్నారు.
సర్కారు టీకా వ్యూహం…
కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ ఉధృతి భయానకంగా ఉంది. ఏడాది క్రితం కొవిడ్‌ వ్యాధి తీవ్ర రూపం దాల్చేందుకు నాలుగైదు నెలలు సమయం పట్టింది. ఈ దశలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా కేవలం నెల రోజుల్లోనే అందరినీ చుట్టేసింది. జన సమూహంలోనైతే ఎక్కువ మందికి వైరస్‌ అంటుకున్నది. ప్రతీ కుటుంబానికి తెలిసిన బంధువులు, సన్నిహితుల్లో ఎవరో ఒకరు వైరస్‌ బారిన పడిన వారే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి దుస్థితిలో కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే క్షేత్ర స్థాయిలో మూలాలను వెతకాల్సిన అవసరాన్ని రాష్ట్ర సర్కారు గుర్తించింది. మొదట జ్వర సర్వేతో స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలు ఉన్న వారిని ఇంటి వద్దే గుర్తించి చికిత్స ప్రారంభించేలా చేశారు. తద్వార వేలాది మంది దవాఖానల మెట్లు ఎక్కకుండా ఎవరింట్లో వారే కరోనా నుంచి కోలుకునే వెసులుబాటు ఏర్పడింది. ఇప్పుడు మరోమారు ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్నది. జన సంచారంలో ఎక్కువగా భాగస్వామ్యం అవుతున్న ఆటోవాలాలు, రేషన్‌ డీలర్లు, గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ బాయ్స్‌, పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది, ఫెర్టిలైజర్‌ విక్రేతలు, పూలు, పండ్ల దుకాణాదారులను సూపర్‌ స్ప్రెడర్లుగా గుర్తించారు. వీరి ద్వారా వైరస్‌ వ్యాప్తి వేగంగా, ఎక్కువ మందికి తాకుతుందనే అభిప్రాయంతో వీరందరికీ వ్యాక్సిన్‌ అందివ్వాలని సర్కారు భావించింది.
10వేల మంది గుర్తింపు…
సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మూడు రోజులుగా సూపర్‌ స్ప్రెడర్ల వివరాలను సంబంధిత శాఖల ద్వారా తెప్పించుకున్నది. ఆటోవాలాలను రవాణా శాఖ నుంచి, రేషన్‌ దుకాణాదారులు, పెట్రోల్‌ బంకు సిబ్బంది, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ వివరాలను పౌరసరఫరాల శాఖ ద్వారా, పూలు, పండ్లు విక్రేతల వివరాలను ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్ల నుంచి లెక్కలను సేకరించా రు. ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా వచ్చిన వివరాల మేరకు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తుల వివరాలతో జాబితాను రూపొందించారు. నిజామాబాద్‌ జిల్లాలో 6,435 మంది, కామారెడ్డి జిల్లాలో 3,450 మందిని సూపర్‌ స్ప్రెడర్లుగా నిర్ణయించారు. వీరు నివాసం ఉంటున్న ప్రదేశాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీరందరికీ టీకాలు పంపిణీ చేయబోతున్నారు. 45 ఏండ్లు పైబడి ఇదివరకే ప్రభుత్వ నిబంధనల మేరకు టీకాలు తీసుకున్న వారిని జాబితాలో చేర్చలేదు. ప్రభుత్వ ప్రాధాన్యతలో టీకాలు తీసుకోని వారిని మాత్రమే ఎంపిక చేశారు. వీరందరికీ మొదటి డోసు టీకాలను అందించనున్నారు.
నేడు, రేపు వాక్సినేషన్‌…
రెండు రోజుల పాటుగా సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 24 కేంద్రాల్లో 3,450 మందికి టీకాలు వేయనున్నారు. కామారెడ్డి పట్టణంలో మూడు సెంటర్లు, మిగిలిన మండలాల్లో 21 కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శుక్ర, శనివారాల్లో అందరికీ టీకాలు వేయనున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 6,435 మంది సూపర్‌ స్ప్రెడర్లకు టీకాలు ఇచ్చేందుకు మొత్తం 18 సెంటర్లు ఏర్పాటు చేశారు. పలు మండలాల్లో సూపర్‌ స్ప్రెడర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో రెండు మండలాలకు కలిపి ఒకే కేంద్రాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా ఏర్పాటు చేశారు. సాధారణ టీకాల పంపిణీకి ఏ మాత్రం ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌ చేపడుతున్నారు. సాధారణంగా లాక్‌డౌన్‌ వంటి కఠిన సమయంలోనూ ఎల్పీజీ గ్యాస్‌ సరఫరదారులు, పెట్రోల్‌ బంకు సిబ్బంది, రేషన్‌ దుకాణాదారులు, ఫెర్టిలైజర్‌ దుకాణాల నిర్వాహకులంతా ఎక్కువ మందితో వ్యాపారాలు, ఇతరత్రా కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. ఇంటింటికెళ్లి సేవలు అందించే వారైతే కరోనా సోకిన వారి చెంతకెళ్లి సర్వీస్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కరోనా వీరికి సులువుగా సోకే అవకాశాలున్నాయి. అంతేకాక వీరి ద్వారా మిగిలిన వారికీ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కట్టడికి ‘సూపర్‌' ప్లాన్‌

ట్రెండింగ్‌

Advertisement