బీజేపీని వీడుతున్న శ్రేణులు
టీఆర్ఎస్లోకి వలసల జోరు
స్వచ్ఛందంగా చేరుతున్న నాయకులు, కార్యకర్తలు
ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న చేపూర్, నీల-1 ఎంపీటీసీలు
ఆర్మూర్/ నందిపేట్, ఫిబ్రవరి 7: నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా చేరుతున్నారు. సోమవారం ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్ సమక్షంలో బీజేపీకి చెందిన చేపూర్, నీలా-1 ఎంపీటీసీ సభ్యులతోపాటు పలువురు గులాబీ పార్టీలో చేరారు.
ఆర్మూర్ మండలం చేపూర్గ్రామ ఎంపీటీసీ బాలనర్సయ్య(బీజేపీ) తన అనుచరవర్గంతోపాటు నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన ముదిరాజ్ కుల సంఘం ప్రతినిధులు, సభ్యులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడు తూ…వచ్చే రెండు మూడు నెలల్లో జిల్లావ్యాప్తంగా బీజేపీతో సహా ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు ఉధృతంగా ఉంటాయని, ఇక వార్ వన్ సైడే అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నిజామాబాద్ జిల్లా ప్రజలు టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలకు ఆకర్షితులై అన్నివర్గాల వారు టీఆర్ఎస్లో చేరడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలోజడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీపీ నర్సయ్య, చేపూర్ సర్పంచ్ సాయన్న, గ్రామశాఖ అధ్యక్షుడు రిక్కల రాజారెడ్డి, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్, సాయిరాం, ప్రవీణ్, రాందాస్, గంగాధర్, రాములు, గంగారాం, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.