e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home కామారెడ్డి ‘బృహత్‌' సంకల్పం

‘బృహత్‌’ సంకల్పం

‘బృహత్‌' సంకల్పం

మండల కేంద్రాలతోపాటు మున్సిపాలిటీల్లోనూ చురుగ్గా ఏర్పాట్లు
10 ఎకరాల్లో మియావాకి తరహాలో మొక్కల పెంపకం
సీఎం ఆదేశాలతో కార్యాచరణను సిద్ధంచేస్తున్న యంత్రాంగం
ఉమ్మడి జిల్లాలో బృహత్‌ ప్రకృతివనాలకు 500 ఎకరాలు అవసరం
అనువైన ప్రదేశాల ఎంపికలో అధికారులు నిమగ్నం
మున్సిపాలిటీల్లో ఐదు నుంచి 10 ఎకరాలలోపు స్థలాల గుర్తింపు

నిజామాబాద్‌, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా.. స్వచ్ఛ పల్లెలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. పకడ్బందీ పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రకృతివనాలతో గ్రామాలు కొత్తందాలను సంతరించుకుంటున్నాయి. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ.. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పట్టణాలు, మండలకేంద్రాల్లో బృహత్‌ ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 10ఎకరాల స్థలంలో మియావాకి పద్ధతిలో మొక్కలను నాటి సంరక్షించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు స్థలసేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. నిజామాబాద్‌ జిల్లాలోని 29 మండలాలకు 27 మండలాల్లో.. కామారెడ్డిలోని 22 మండలాల్లో 10 ఎకరాల చొప్పున బృహత్‌ ప్రకృతి వనాలకు స్థలాలను సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ‘బృహత్‌’ కార్యక్రమానికి దాదాపు 500 ఎకరాల స్థలం అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. పట్టణాల్లో స్థలం తక్కువగా లభ్యమయ్యే అవకాశాలు ఉండడంతో.. కనీసం ఐదు నుంచి పది ఎకరాల స్థలంలో పార్కులను ఏర్పాటు చేయనున్నారు. మూడు వరుసల్లో పండ్లు, పూలు, ఔషధ మొక్కలు పెంచడంతోపాటు పిల్లల కోసం ఆటస్థలం, పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.

స్వాతంత్య్ర సంగ్రామంలో గ్రామాలే దేశానికి వెన్నెముక అంటూ జాతిపిత మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్య స్థాపనకై ముందుకు కదిలారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో గాంధీ మహాత్ముడి బాటలోనే సీఎం కేసీఆర్‌ నడుస్తున్నారు. గ్రామ స్వరాజ్యం స్థాపనే లక్ష్యంగా మౌలిక సదుపాయాలు, ఆర్థిక పరిపుష్టి కల్పిస్తూ పంచాయతీలను గతంలో ఎన్నడూ లేని విధంగా బలోపేతం చేశారు. తెలంగాణ రాకమునుపు చిందరవందరగా ఉన్న గ్రామాలు ఇప్పుడు సంక్షోభం నుంచి సంక్షేమం వైపునకు పరుగులు తీస్తున్నాయి. పల్లెల్లో ప్రగతి పండుగ జోరుగా సాగడంతో పచ్చందాలు పరుచుకున్నాయి. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో సమూల మార్పులు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ప్రకృతిని సంరక్షించడం, పర్యావరణ వనరులను పునరుద్ధరించడంతో పాటు కొంగొత్తగా పల్లెలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఖాళీ స్థలాలతోపాటు వ్యవసాయ భూములు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటడం ద్వారా ఆహ్లాదాన్ని పంచుతు న్నాయి. గ్రామాల్లో పచ్చదనం పెంపు విధానాన్ని మరింత పటిష్ట పరుస్తూ మండల కేంద్రాల్లో బృహత్‌ ప్రకృతి వనా లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్నది. దాదాపు10 ఎకరాల భూమిలో మియావాకి విధానంలో మొక్కలను నాటాలని నిర్ణయించడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఇప్పటికే 1325 పల్లె ప్రకృతి వనాలు…
పల్లె ప్రగతిలో భాగంగా ఊరూరా వెలసిన పల్లె ప్రకృతి వ నాలు కొత్త అందాలను తీసుకువచ్చాయి. ఎకరం స్థలం లో గ్రామ పంచాయతీలో ఏర్పాటైన పీపీవీల్లో మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది. ఆహ్లాదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేయడంతో పల్లె జనాన్ని ఆకర్షిస్తున్నాయి. నిజామాబాద్‌లో 530 గ్రామ పంచాయతీ పరిధిలో 660, కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయ తీ పరిధిలో 665 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు ప్రభు త్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పల్లెలు, పట్టణాల్లో వేల ఎకరాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మండల కేంద్రాల్లో, పట్టణాల్లో ఒక్కో చోట సుమారుగా 10 ఎకరాల స్థలాల్లో బృహత్‌ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పట్టణాల్లో స్థలం తక్కువగా లభ్యమయ్యే అవకాశాలు ఉండడంతో కనీసం ఐదు నుంచి పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్‌లో 29 మండలాలకు 27 మండలాల్లో 10 ఎకరాల చొప్పున స్థలాలు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కామారెడ్డి 22 మండలాల్లో 10 ఎకరాల చొప్పున బృహత్‌ ప్రకృతి వనాలకు స్థలాలను సేకరిస్తున్నారు. రెండు జిల్లాల్లో మండలానికో బృహత్‌ వనాలను ఏర్పాటు చేయాలంటే దాదాపుగా మొత్తం 500 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
పట్టణాల్లోనూ బృహత్‌ ప్రణాళిక…
బృహత్‌ ప్రకృతి వనాలను మండలాలతో పాటుగా పట్టణాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు వచ్చాయి. ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చిచెట్లు, ముళ్లకంపలు తొలగించి, ఎత్తు పల్లాలుగా ఉంటే సరిచేసి మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత ప్రదేశాల్లో రెండు వరుసల్లో 1.5 ఎత్తు ఉండే నీడ, ఫలాలిచ్చే మొక్కలు నాటడం, ప్రదేశాలను గుర్తించిన తర్వాత సాంకేతికపరమైన అనుమతులకు అటవీ, ఉద్యానవన అధికారుల సహకారం తీసుకోనున్నారు. బీపీవీల్లో ప్రజలు నడిచేందుకు వీలుగా 6 మీటర్ల వెడల్పుతో వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయబోతున్నారు. పట్టణాల్లో 5-10 ఎకరాల బీపీవీని నాలుగు భాగాలు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో భాగంలో ఒక మీటర్‌ పొడవు, వెడల్పుతో 3,600 చొప్పున 15వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఎకరంలో ఏర్పాటు చేసే చిన్న వనాల్లో 1900 మొక్కలు నాటేలా చూడాలని సర్కారు పేర్కొన్నది. విత్తనాలు, మొక్కలు అందుబాటులో లేకపోతే అటవీ, ఇతర శాఖలకు చెందిన నర్సరీల నుంచి తీసుకోనున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో నాలుగు పురపాలికలున్నాయి. కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో బృహత్‌ పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థలాలను గుర్తించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. త్వరలోనే కొలిక్కి రానుంది.
ఆహ్లాదానికి కేరాఫ్‌గా…
పల్లె, పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేలా… ప్రభుత్వం ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అర ఎకరం నుంచి ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాలు ఇప్పటికే ఏర్పాటు అయ్యాయి. అందుకు రూ.3లక్షల నుంచి రూ.6.50 లక్షలు మంజూరు చేసింది. ఒక్కో వనంలో వెయ్యి నుంచి 3 వేల మొక్కలను నాటారు. గ్రామ నర్సరీల్లోని మొక్కలను ఇందుకోసం వినియోగించారు. పండ్లు, అందానిచ్చే 26 రకాల మొక్కలను నాటారు. 2వేల దాకా మొక్కల చుట్టూ కంచె వేయించి మూగ జీవాల బారిన పడకుండా సంరక్షణ చర్యలు చేపట్టారు. నిరంతరం నీరు అందించేలా బోరు బావిని తవ్వించి పంచాయతీ కార్మికులకు పర్యవేక్షణ బాధ్యతల్ని కట్టబెట్టారు. వనంలో ఆకట్టుకునే మొక్కలు, విశాలమైన దారుల్ని అందుబాటులోకి తెచ్చారు. మరో నాలుగైదు నెలల్లో మొక్కలు ఎదిగితే పట్టణాల్లోనే ఉద్యానవనాలను తీసిపోయేలా ప్రకృతి వనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రకృతి వనంలో నడక సాగించేందుకు, సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా సందర్శించేందుకు వీలుగా తీర్దిదిద్దారు. పది ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే బృహత్‌ ప్రకృతి వనాలు సైతం భారీ పార్కులను తలపించనున్నాయి. బీపీపీవీ ద్వారా మొక్కల సంరక్షణ చేపట్టడంతో పర్యావరణ, పచ్చదనం పరిరక్షణకు కృషి చేసినట్లు అవుతుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘బృహత్‌' సంకల్పం
‘బృహత్‌' సంకల్పం
‘బృహత్‌' సంకల్పం

ట్రెండింగ్‌

Advertisement