ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Kamareddy - Jan 27, 2021 , 00:46:12

ప్రగతిపథంలో కామారెడ్డి జిల్లా

ప్రగతిపథంలో కామారెడ్డి జిల్లా

పకడ్బందీగా సంక్షేమ పథకాల అమలు

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి టౌన్‌, జనవరి 26: అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో కామారెడ్డి జిల్లా ప్రగతి పథంలో పయనిస్తున్నదని కలెక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లా వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని తన ప్రసంగంలో వివరించారు. గత వానకాలంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురియడంతో అన్ని జలాశయాల్లో సమృద్ధిగా నీరు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 4 లక్షల 87 వేల 851 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారని పేర్కొన్నారు. సాధారణం కన్నా 22 శాతం అధిక విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు తెలిపారు. రైతుబంధు కింద యాసంగిలో 2 లక్షల 54 వేల 693 మంది రైతు ఖాతాల్లో రూ.255.8కోట్లు జమ చేశామన్నారు.రైతు బీమా కింద జిల్లాలో ఒక్కో రైతుకు రూ.3,487 ప్రీమియం చొప్పున లక్షా 68,700 మంది రైతులను అర్హులుగా గుర్తించి రూ. 58. 85 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. 

జిల్లాలో 104 వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికలను రాష్ట్రంలోనే మొదటగా నిర్మాణం పూర్తి చేశామన్నారు. వానకాలంలో పండించిన 3 కోట్ల 75 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని 340 కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామన్నారు. రూ.709.61 కోట్లను లక్షా 7,370 మంది రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశామని వివరించారు.

2019-2020లో జిల్లాలోని చెరువుల్లో 2.81 కోట్ల చేపపిల్లలు విడుదల చేయగా.. 7106 టన్నుల చేపల ఉత్పత్తి వచ్చిందని తెలిపారు. 2020-2021 సంవత్సరానికి జిల్లాలో 556 చెరువుల్లో 2.32 కోట్ల చేపపిల్లలను రూ.2.58 కోట్ల వ్యయంతో విడుదల చేశామన్నారు. నిజాంసాగర్‌, కౌలాస్‌నాలా, అడ్లూర్‌ ఎల్లారెడ్డి, కామారెడ్డి, పెద్దచెరువుల్లో 24 లక్షల 95వేల రొయ్యపిల్లలను విడుదల చేశామని తెలిపారు.

జిల్లాలో 8226 డబుల్‌ ఇండ్ల నిర్మాణానికి రూ.431 కోట్లు మంజూరుకాగా,  5,717 ఇండ్ల నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు.  3,106 ఇండ్లు పూర్తికాగా, 1905 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.706 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం కింద 2020-2021 సంవత్సరానికి 5,514 కుటుంబాలకు రూ.55 కోట్ల 20 లక్షల 39 వేల 624 అందజేసినట్లు వివరించారు.

ఉపాధి హామీ పథకం ద్వారా 2020-2021లో ఇప్పటి వరకు 27 వేల 832 పనులు చేశామన్నారు.3 లక్షల 17 వేల 779 కూలీలకు కోటీ 92 వేల పని దినాలు కల్పించి, రూ. 161.73 కోట్లు వేతనంగా చెల్లించామని తెలిపారు.

కూలీలకు ఉపాధి కల్పించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. హరితహారం కింద  86 లక్షల 49 వేల మొక్కలు నాటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌శోభ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, జిల్లా అదనపు జడ్జి బి. సత్తయ్య, ఎస్పీ శ్వేత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీను, కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌చైర్‌పర్సన్‌ ఇందుప్రియ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు ముఖ్య కాలువలు, ఉప కాలువల ఆధునీకరణకు, జిల్లాలో కాలువల పనులకు రూ.276 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ. 250 కోట్ల పనులు పూర్తయినట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో ప్రస్తుత యాసంగిలో వివిధ ప్రాజెక్టుల కింద 48 వేల 127 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు పేర్కొన్నారు.

VIDEOS

logo