బుధవారం 03 మార్చి 2021
Kamareddy - Jan 26, 2021 , 00:16:56

ఆశలు రేకెత్తిస్తున్న ఆయిల్‌ ఫామ్‌

ఆశలు రేకెత్తిస్తున్న ఆయిల్‌ ఫామ్‌

బొప్పాస్‌పల్లి విత్తనోత్పత్తి క్షేత్రంలో అద్భుతఫలితాలు

ప్రత్యామ్నాయ పంటగా సాగుకు అవకాశం

రైతులు ముందుకురావాలని సూచిస్తున్న అధికారులు

నస్రుల్లాబాద్‌, జనవరి 25  :

జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుపై రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. బొప్పాస్‌పల్లి విత్తనోత్పత్తి క్షేత్రంలో రెండేండ్ల క్రితం ప్రయోగాత్మకంగా వేసిన ఆయిల్‌ఫామ్‌ పంట ఆశాజనకంగా ఉంది. మరో నాలుగేండ్లలో పంట చేతికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా వేసిన పంటతో మంచి ఫలితాలు వస్తున్నాయని, రైతులు దీన్ని సాగు చేయొచ్చని సూచిస్తున్నారు. ఆయిల్‌పామ్‌తో రైతులు ఊహించని లాభాలు పొందవచ్చని అంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉద్యానశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట తదితర జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతున్నది. నస్రుల్లాబాద్‌ మండలంలోని బొప్పాస్‌పల్లి విత్తనోత్పత్తి క్షేంత్రంలో 2018 జూన్‌ 8న అప్పటి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు ఈ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. 

ఆయిల్‌పామ్‌తో దీర్ఘకాలిక ప్రయోజనాలు

మన దేశంలో ఏటా రూ.70 వేల కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. మన వద్దే ఆయిల్‌పామ్‌ తోటలను పెంచితే దిగుమతులు అవసరం ఉండదు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు పెంచేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారి ఆయిల్‌పామ్‌ మొక్కలను నాటితే నాలుగేండ్లలో దిగుబడి ప్రారంభమవుతుంది. 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. ఎకరాకు ప్రతి సంవత్సరం రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పంటకు పక్షులు, కోతుల బెడద ఉండదు. రసాయనాలు వాడాల్సిన అవసరం ఉండదు. ఆయిల్‌పామ్‌ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నది. తోటల విస్తీర్ణం పెరిగితే ఫ్యాక్టరీల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. బొప్పాస్‌పల్లి విత్తన క్షేత్రంలో 2.38 ఎకరాల్లో 136 మొక్కలు నాటారు. ప్రస్తుతం పూత, గెలలు వచ్చి ఆరోగ్యంగా ఉన్నాయి

ఆయిల్‌పామ్‌ సాగుకు కృషి

కామారెడ్డి జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు చేసేలా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో సర్వే చేపట్టిన అధికారులు నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, కోటగిరి, వర్ని, రుద్రూర్‌ మండలాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉందని గుర్తించారు. ఇందులో భాగంగా ముందుగా నస్రుల్లాబాద్‌ మండలంలోని ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రంలో 2.38 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని నిర్ణయించారు. 2018 జూన్‌ 8న పోచారం శ్రీనివాసరెడ్డి, ఉద్యాన, వ్యవసాయశాఖ రాష్ట్ర అధికారులు ఆయిల్‌పామ్‌ సాగును ప్రారంభించారు. అదే సమయంలో రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. భద్రాద్రి జిల్లాలోని రైతులను ఇక్కడికి రప్పించి రైతులకు అవగాహన కల్పించారు. విత్తనోత్పత్తి క్షేత్రంలో పంట వేసి రెండేండ్లు పూర్తయ్యింది. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి. మరో రెండేండ్లలో పంట చేతికొస్తుందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన ఆయిల్‌పామ్‌ పంట మంచి ఫలితాలను ఇస్తే బాన్సువాడ నియోజకవర్గంలోని మండలాల్లో సాగు చేసేలా అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. వంట నూనెల దిగుమతి తగ్గించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఈ పంటను పెద్ద మొత్తంలో సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. 


VIDEOS

logo