శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Kamareddy - Jan 24, 2021 , 00:53:38

తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన

తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన

స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి 

20 మంది స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లకు నియామక పత్రాలు అందజేత 

బాన్సువాడ, జనవరి 23: తల్లీబిడ్డల సంక్షేమం కోసమే బాన్సువాడలో మాతాశిశు దవాఖానను నిర్మించామని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో నిర్మించిన వంద పడకల మాతాశిశు దవాఖానను ఆయన శనివారం సందర్శించారు. దవాఖానలో కొత్తగా విధుల్లో చేరనున్న 20 మంది స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ర్టానికి ఏడు మాతాశిశు దవాఖానలు మంజూరు కాగా.. బాన్సువాడలోనే వంద పడకల వైద్యశాల ముందుగా పూర్తయ్యిందని తెలిపారు. దవాఖానలో అన్ని రకాల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. బాన్సువాడ దవాఖానకు కాయకల్ప అవార్డు వరుసగా మూడోసారి రావడంపై దవాఖాన సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ప్రసాద్‌, వైద్య సిబ్బందిని స్పీకర్‌ అభినందించారు. దవాఖానలో అందుతున్న సేవలను తెలుసుకున్నారు. మండలంలోని కస్తూర్బాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు రావడం లేదని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. కమిషనర్‌తో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు. డీసీహెచ్‌ అజయ్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో మోహన్‌బాబు, ఆర్డీవో రాజాగౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆయన పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పాత బాన్సువాడలోని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 

తెలంగాణ తిరుమలలో  అభివృద్ధి పనుల పరిశీలన

బీర్కూర్‌, జనవరి 23: మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించే ఆలయ బ్రహ్మోత్సవాల వరకు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనే తిమ్మాపూర్‌ వేంకటేశ్వరస్వామి దేవాలయం మహా పుణ్యక్షేత్రంగా మారుతుందని అన్నారు. 

VIDEOS

logo