గురువారం 04 మార్చి 2021
Kamareddy - Jan 23, 2021 , 00:37:06

వాట్సాప్‌లో పరీక్ష

వాట్సాప్‌లో పరీక్ష

  • ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రశ్నలు
  •  పాఠ్యాంశాల్లో పట్టు సాధించేందుకు తోడ్పాటు
  •  ఇంటింటా చదువుల పంటతో మేలు

విద్యానగర్‌, జనవరి 22 : కొవిడ్‌-19 కారణంగా ఇప్పటికీ పాఠశాలలు తెరుచుకోలేదు. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు పాఠశాలల్లో బోధన ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,011 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు సుమారు 96 వేల మంది విద్యార్థులు ఉన్నారు. 8వ తరగతి వరకు ఆన్‌లైన్‌ పాఠాలు కొనసాగించనున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ లేక పోవడవంతో చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠాలు వినలేకపోతున్నారు. చదువుపై అంతగా శ్రద్ధ కనబరచలేడంలేదు. మరో మూడు నెలల్లో వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. దీంతో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారోననే ఆందోళన నెలకొన్నది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు పరీక్షల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇంటింటా చదువుల పంట కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌ తరగతులకు విద్యుత్‌ అంతరాయం, ఫోన్‌ అందుబాటులో లేక పోవడం, ఇంటర్నెట్‌ లేకపోవడం వంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనున్నది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి ఇంటింటా చదువుల పంటకు ఈ నెల 11వ తేదీన విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.

రోజుకు పది ప్రశ్నలు

విద్యార్థులు వాట్సాప్‌ ద్వారా నమస్తే అని 8595524405 నంబర్‌కు సందేశం పంపాలి. విద్యార్థి పూర్తి పేరు, తరగతి, మీడియం నమోదు చేయాలి. తరగతుల వారీగా సంబంధిత పాఠ్యాంశాల్లో ఎనిమిది ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వాట్సాప్‌ ద్వారా పంపుతారు. విద్యార్థులు వాటిని నింపితే కీతోపాటు ఎన్ని సరైన జవాబులు రాశారో, ఎన్ని తప్పు రాశారో వస్తుంది. ఇవి తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటాయి. వాటికి సమాధానాలు ఎంపిక చేసి సబ్మిట్‌ చేయాలి. వెంటనే ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాశారు? ఎన్ని తప్పులు? అనేవి చూపడంతోపాటు సరైన సమాధానాలు వస్తాయి. ఇలా వారానికి రెండు సార్లు పంపించవచ్చు. విద్యార్థులు చదువుల పంట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

కఠినమైన పాఠ్యాంశాలకు ప్రాధాన్యం

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చాలా వరకు సిలబస్‌ను తగ్గించారు. అయినప్పటికీ విద్యార్థులు పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోతున్నారు. దీంతో పాఠ్యాంశాల్లో కఠినమైన పాఠాలపై దృష్టి సారించనున్నారు. వాట్సాప్‌ ద్వారా పంపే ప్రశ్నల్లో ఆయా పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమం మార్చి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తున్నది. జిల్లాలో చాలా మంది వాట్సాప్‌ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. 

కఠిన పాఠాలు సులభంగా..

ఇంటింటా చదువుల పంట పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించడంతో కఠిన పాఠాలను సులభంగా నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. వాట్సాప్‌ ద్వారా ప్రశ్నలు పొంది సాధన చేస్తున్నాను. దీంతో పరీక్షల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

-ఎం.వరలక్ష్మి, పదో తరగతి విద్యార్థిని, కామారెడ్డి

విద్యార్థుల సందేహాల నివృత్తి

ఇంటింటా చదువుల పంట కార్యక్రమం విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆన్‌లైన్‌ పాఠాలు విన్నప్పటికీ కఠినమైన పాఠాలు తెలుసుకోవడానికి విద్యార్థులకు సహాయపడనున్నది.

-రాజు, డీఈవో, కామారెడ్డి

చాలా బాగా అర్థమవుతున్నది

కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడంతో కఠినమైన పాఠాలు అర్థం అయ్యేవి కావు. వాట్సాప్‌ ద్వారా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఇప్పుడు చాలా బాగా అర్థం అవుతున్నది. సమాధానాలు తప్పుగా రాస్తే వాటికి వెంటనే సమాధానం తెలుస్తున్నది. 

-ఎల్‌. రోజా, పదోతరగతి విద్యార్థిని, కామారెడ్డి

VIDEOS

logo