శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Kamareddy - Jan 22, 2021 , 01:24:58

జాతీయ నాణ్యతా ప్రమాణాలకు మన దవాఖానల పోటీ

జాతీయ నాణ్యతా ప్రమాణాలకు మన దవాఖానల పోటీ

  •  ఏటా ఉమ్మడి జిల్లాకు కాయకల్ప అవార్డుల పంట
  • వరుసగా మూడో ఏడాదీ బాన్సువాడ దవాఖానకు పురస్కారం
  • ఏరియా వైద్యశాలల విభాగంలో మొదటి ర్యాంక్‌
  •  ప్రసూతి వైద్యసేవలు, స్వచ్ఛతకు పెద్దపీట
  • జిల్లా దవాఖానల కేటగిరీలో బోధన్‌కు రెండో స్థానం
  •  ‘లక్ష్య’ అవార్డు సాధన దిశగా అడుగులు
  • అవార్డు సాధనకు వైద్యసిబ్బంది కృషి

మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ.. కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అందిస్తూ ఉమ్మడి జిల్లాలోని దవాఖానలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్త్తమ వసతులు, అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తున్నాయి. 2019-2020 సంవత్సరానికిగాను రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న సదుపాయాలు, పరిశుభ్రత, మరుగుదొడ్లు, క్యాంటీన్‌ నిర్వహణ వంటి ఏడు అంశాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్రంలోనే బాన్సువాడ ఏరియా దవాఖాన మొదటి స్థానంలో.. బోధన్‌ జిల్లా దవాఖాన ద్వితీయ స్థానంలో నిలిచి కాయకల్ప అవార్డులను సొంతం చేసుకున్నాయి. మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడంతో దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. కేసీఆర్‌ కిట్ల పంపిణీ, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు, స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రైవేట్‌ దవాఖానలకు దీటుగా సేవలు అందించే స్థాయికి వైద్యశాలలు చేరుకుంటున్నాయి. బాన్సువాడ ఏరియా దవాఖాన వరుసగా మూడుసార్లు కాయకల్ప అవార్డు అందుకోవడమే ఇందుకు నిదర్శనం. కేంద్రప్రభుత్వం అందించే ‘లక్ష్య’ పురస్కారాలను సాధించే దిశగా ప్రస్తుతం ఈ దవాఖానలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెలలో రాష్ట్రస్థాయి బృందం  పరిశీలించనుండగా, తదుపరి కేంద్రబృందం పర్యటించనుంది.

బాన్సువాడ రూరల్‌, జనవరి 21 : బాన్సువాడ ఏరియా దవాఖానలో అందుతున్న నాణ్యమైన వైద్య సేవలతో కార్పొరేట్‌ దవాఖానను తలపిస్తున్నది. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండడంతో దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ మహిళలకు నాణ్యమై ప్రసూతి వైద్యం అందడంతో డివిజన్‌లోని వివిధ మండలాలకు చెందిన గర్భిణులు ప్రసవాల కోసం ఏరియా దవాఖానకు వస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో  ప్రసవాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది 3120 ప్రసవాలు జరిగాయి. దీంతో బాన్సువాడ ఏరియా దవాఖాన సుఖ ప్రసవాలకు నిలయంగా మారింది. అత్యాధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. దవాఖానలో 24 గంటల పాటు అందుబాటులో వైద్యులు ఉండడం, అన్ని వసతులు కలిగిన ఆపరేషన్‌ థియేటర్‌, బ్లడ్‌బ్యాంకు, శిశువుల కోసం అత్యాధునిక చిల్డ్రన్స్‌వార్డు (ఎన్‌బీఎస్‌యూ) అందుబాటులో ఉన్నాయి. 

సేవలకు గుర్తింపు.. 

రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు దవాఖానను పరిశుభ్రంగా ఉంచుతూ కార్పొరేట్‌ దవాఖానలకు దీటుగా సేవలందిస్తున్న దవాఖానగా బాన్సువాడ ఏరియా వైద్యశాల పేరొందింది. 2019 -2020 సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న సదుపాయాలు, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, క్యాంటీన్‌ నిర్వహణ వంటి ఏడు అంశాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఉత్తమ ఏరియా దవాఖానగా నిలిచి కాయకల్ప అవార్డును సొంతం చేసుకున్నది. ఇందులో భాగంగా రూ.20 లక్షల ప్రోత్సాహకం అందుకోనున్నది. 2017 - 2018లో రెండో స్థానం, 2018 -2019లో మొదటి స్థానం, 2019 -2020లో మొదటి స్థానం సాధించి రాష్ట్రంలోనే అరుదైన గుర్తింపును దక్కించుకుంది.  

VIDEOS

logo