మంగళవారం 09 మార్చి 2021
Kamareddy - Jan 18, 2021 , 00:14:40

పాడికి ప్రోత్సాహం

పాడికి ప్రోత్సాహం

కామారెడ్డి జిల్లాలో క్షీర విప్లవం

సబ్సిడీపై గడ్డి విత్తనాలు, దాణా 

రైతులకు 2,831 పాడిపశువుల పంపిణీ

జిల్లాలో 15 బీఎంసీలు.. రోజూ 18 వేల లీటర్ల పాల సేకరణ

బాన్సువాడలో 10 వేల లీటర్ల బీఎంసీ ఏర్పాటుకు చర్యలు

కామారెడ్డి, జనవరి 17 :

వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నది. పాడి రైతును ఆదుకునేందుకు గడ్డి విత్తనాలు, దాణా సరఫరా మొదలుకొని పాల సేకరణ వరకు అన్ని దశల్లోనూ రాయితీ కల్పిస్తుండడంతో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. దీనికి తోడు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అందిస్తున్న ప్రోత్సాహంతో రైతులు పాడిపరిశ్రమపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) దళారీ వ్యవస్థను నిర్మూలించి, రైతులకు అండగా నిలుస్తున్నది. పశుపోషణలో మెళకువలు, సహకార రంగంలో ఉత్పత్తి, లాభాలు తదితర అంశాలపై నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు డెయిరీలను తట్టుకొని విజయ డెయిరీని నిలబెట్టేందుకు అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు అందేలా చూస్తున్నారు. గడ్డివిత్తనాలు, పోషకాలతో కూడిన దాణాను అందిస్తుండడంతో పశువుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. పాలను సహకార సంఘాల ద్వారా సేకరిస్తున్నారు. వైద్యశిబిరాలు నిర్వహించి పశువులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇవ్వడం, కృత్రిమ గర్భధారణతో ఆడ దూడలు పుట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. లీటరు పాలకు వెన్న శాతంపై ఇచ్చే ధరకు అదనంగా ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకంగా ఇవ్వడం, 15 రోజుల్లో డబ్బులు ఖాతాల్లో జమ చేయడం వంటి చర్యలతో రైతులను ప్రోత్సహిస్తున్నారు. రైతుల వద్ద సేకరించిన పాలను గ్రామాల్లో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల(బీఎంసీ)లో నిల్వ చేయడం ద్వారా పాల సేకరణ సులువుగా అమలవుతోంది. ఇందులో కొన్ని సమాఖ్యల ద్వారా నేరుగా బీఎంసీలను నిర్వహిస్తుండగా మరికొన్ని గ్రామస్థాయి పాల ఉత్పత్తి సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 15 బీఎంసీలు ఉన్నాయి. ఇందులో కామారెడ్డి, వేల్పుగొండ, అడ్లూర్‌ఎల్లారెడ్డి, గాంధారి, ఎల్లారెడ్డి, లింగంపేట, చిల్లర్గి, బిచ్కుంద, జుక్కల్‌లోని బీఎంసీలను సమాఖ్య నిర్వహిస్తున్నది. భిక్కనూరు, తాడ్వాయి, ఎర్రాపహాడ్‌, బీబీపేట, దోమకొండ, రాజంపేట బీఎంసీలను అక్కడి పాల సంఘాల ద్వారా నిర్వహిస్తున్నారు. 15 బీఎంసీలకు 214 గ్రామాల నుంచి 10 వేల 900 మంది పాడి రైతులు పాలను సరఫరా చేస్తున్నారు. బీఎంసీల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. దీంతో కామారెడ్డి జిల్లాలో నిత్యం 18 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. పాడి పశువుల పంపిణీ పథకం కింద జిల్లాలో 2,831 పశువులను అందజేశారు. 

కామారెడ్డిలో పాలశీతలీకరణ కేంద్రం

కామారెడ్డిలోని పాతరాజంపేట పాలశీతలీకరణ కేంద్రంలో 35 వేల లీటర్ల పాలను నిల్వ చేయవచ్చు. జిల్లాలోని రైతుల నుంచి సేకరించిన పాలను బీఎంసీలకు, అక్కడి నుంచి కామారెడ్డిలోని కేంద్రానికి తరలిస్తారు. ఇక్కడే రైతులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించారు. కొత్తగా బాన్సువాడలోని సోమేశ్వర్‌ వద్ద 10 వేల లీటర్ల సామర్థ్యం గల బీఎంసీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ట్రయల్న్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

పాల ఉత్పత్తుల విక్రయం

పాల ఉత్పత్తులు, పదార్థాలను విక్రయించేందుకు ప్రత్యేక ప్రణాళికతో సమాఖ్య అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇందు కోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు నెలకొల్పారు. కామారెడ్డిలో రెండు, దోమకొండ, గాంధారి, బిచ్కుంద, లింగంపేటలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ-కార్ట్‌ ద్వారా ఐదు సంచార కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 

ఎనిమల్‌ హాస్టల్‌కు చర్యలు

పాల ఉత్పత్తి విషయంలో రైతులకు మరింత అవగాహన అవసరం. పాల ఉత్పత్తిని పెంచడానికి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రైతులను ప్రోత్సహించడానికి పశుసంవర్ధకశాఖ, సహకార, బ్యాంకు, వ్యవసాయశాఖల అధికారుల సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నాం. వివిధ అంశాల్లో రైతులకు శిక్షణ ఇచ్చి వారిని పాల ఉత్పత్తి వైపు మళ్లిస్తున్నాం. ప్రైవేటు డెయిరీల పోటీని తట్టుకొని సమాఖ్యను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాం. త్వరలో సకల సౌకర్యాలతో ఎనిమల్‌ హాస్టల్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఎనిమిల్‌ హాస్టల్‌ కోసం 35 ఎకరాల స్థలం ఇవ్వడానికి కలెక్టర్‌ శరత్‌ సుముఖత వ్యక్తం చేశారు. పోషక విలువలు కలిగిన దాణాను సరఫరా చేస్తున్నాం. 

-పి.శ్రీనివాస్‌, డిప్యూటీ డైరెక్టర్‌

రోజూ 15 లీటర్ల పాల ఉత్పత్తి

ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తున్నది. సబ్సిడీపై దాణా అందిస్తున్నారు. బర్రెల కొనుగోలుకు రుణాలు ఇప్పిస్తున్నారు. రోజూ 15 లీటర్ల పాలను కేంద్రానికి తరలిస్తున్నా. ప్రతి లీటరు పాలకు ప్రభుత్వం రూ.4 అదనంగా ఇవ్వడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

-రాజేశ్వర్‌రావు, రైతు, బ్రాహ్మణపల్లి

VIDEOS

logo