ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Kamareddy - Jan 10, 2021 , 00:30:07

ప్రమోషన్ల సందడి!

ప్రమోషన్ల సందడి!

వివరాల సేకరణలో అధికార యంత్రాంగం

వివిధ విభాగాల్లో ఖాళీల గుర్తింపునకు కసరత్తు

నెలాఖరులోపు కారుణ్య నియామకాలు పూర్తి

అధికారులకు నిజామాబాద్‌, కామారెడ్డి కలెక్టర్ల ఆదేశం  

ఎల్లారెడ్డి, జనవరి 9: ఉద్యోగులకు ప్రమోషన్లపై తీపి కబురును అందించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఉపాధ్యాయులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు ఆదేశాలు రావడంతో అధికార యంత్రాంగం బిజీబిజీగా మారింది. తెలంగాణ ఏర్పాటు తరువాత ఉద్యోగోన్నతులకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు తెలుసుకుంటున్నారు. ఐదు రోజుల క్రితం రెండు జిల్లాల కలెక్టర్లు ఆయా శాఖల విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెంటనే సేకరించాలని ఆదేశించారు. సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాత జిల్లాల ప్రకారం ప్రమోషన్లు, నియామకాలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఉద్యోగోన్నతులతో పాటు కారుణ్య నియామకాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారు. నాలుగేండ్ల క్రితం కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పడడంతో ఇక్కడ సుమారు 20 శాఖల్లో ఇన్‌చార్జిల పాలన సాగుతున్నది. ప్రస్తుతం చేపట్టనున్న ప్రమోషన్లతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

శాఖల వారీగా వివరాల సేకరణ

ఉమ్మడి నిజామాబాద్‌ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. 30 శాఖల పరిధిలో ఇన్‌చార్జిలు ఖాళీల వివరాలు సేకరించి రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించనున్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా సమాచారాన్ని నిజామాబాద్‌ కలెక్టర్‌ పంపిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే స్థానాలను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 70 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ కానున్నాయని సీనియర్‌ అధికారులు తెలిపారు. ప్రమోషన్ల కారణంగా ఏర్పడే వాటిని ఖాళీలుగా చూపించడంతో కొత్త ఉద్యోగాలు వస్తాయని, తద్వారా నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు ఉంటాయని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి.

నెలాఖరు లోపు కారుణ్య నియామకాలు

ఐదేండ్లుగా కారుణ్య నియామకాలు లేకపోవడంతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వివిధ శాఖల పరిధిలో ఖాళీల సంఖ్య తెలియగానే ఆయా స్థాయిల్లో కారుణ్య నియామకాలు చేపట్టే అవకాశం ఉందని, దీంతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పాత జిల్లాలో కారుణ్య నియామకాల కోసం ఇప్పటికే పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు  తెలుస్తోంది. కారుణ్య నియామకాల్లో నాల్గో తరగతి ఉద్యోగాలను భర్తీ చేస్తే కింది స్థాయి సిబ్బంది కొరత తీరుతుందని, సేవలు కూడా వేగంగా అందించే అవకాశం ఉంటుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ప్రమోషన్ల కన్నా ముందుగా కారుణ్య నియామకాలు చేపట్టేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. కారుణ్య నియామకాలు పూర్తి చేస్తే తరువాత ఖాళీల సంఖ్య తెలుస్తుందని, ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నియామకాలు చేస్తుందని పేర్కొంటున్నారు.

రిటైర్‌ అయ్యేవారికి న్యాయం..

ప్రమోషన్ల కారణంగా వేలాది మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసే వారికి ప్రమోషన్లు లభిస్తే న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్రమోషన్లు లేక నిరుత్సాహంతో ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు ఎస్జీటీగా ఎంపికై 25 సంవత్సరాలకు పైగా పనిచేసి అదే హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్నారు.

-శ్రీనివాస్‌, 

 ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ ఎల్లారెడ్డి.

ఉత్సాహంగా పనిచేస్తారు..

ప్రమోషన్లతో ఉద్యోగులు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. వారిలో చాలా మార్పు వస్తుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ప్రమోషన్లు ఇవ్వడానికి 2016 లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ ఆదేశాలు అమలు చేస్తే వేలాది మంది ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఒక ఉద్యోగి ఉత్సాహంగా పని చేయడానికి ప్రమోషన్‌ ఎంతగానో ఉపకరిస్తుంది.  

-మహిపాల్‌, 

అధ్యక్షుడు, టీఎన్జీవోస్‌ ఎల్లారెడ్డి       

VIDEOS

logo