శనివారం 27 ఫిబ్రవరి 2021
Kamareddy - Dec 27, 2020 , 00:57:07

భూమి నవ్వింది..!

భూమి నవ్వింది..!

దళితులకు భూ పంపిణీలో కామారెడ్డి నంబర్‌వన్‌

రూ.56.28కోట్లతో భూమి కొనుగోలు

528 మందికి మొత్తం 1200 ఎకరాలు పంపిణీ

కామారెడ్డి టౌన్‌: దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీ పథకంలో భాగంగా అర్హులందరికీ మూడెకరాల భూమిని విడుతల వారీగా పంపిణీ చేస్తోంది. భూ పంపిణీలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ 2014లో భూ పంపిణీకి శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి నిరుపేద దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. కూలీనాలీ చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న ఎస్సీ కుటుంబాలకు మూడు ఎకరాలను పంపిణీ చేసి వారిని భూ యజమానులుగా మారుస్తున్నది. కుటుంబంలోని మహిళ పేరిట భూమి పట్టా పాస్‌బుక్కులను అందజేస్తున్నది. భూమిని పంపి ణీ చేయడంతో పాటు బోర్లు వేయించి ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నది. దీంతో దళిత కుటుంబాలు రెండు పంటలను సాగుచేసుకునేలా ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. 

నీటి సౌకర్యం ఉన్న భూముల్లో వరిని సాగుచేసుకుంటుండగా.. నీటి సౌకర్యం సరిగా లేని భూముల్లో ఆరుతడి పంటలను సాగుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి జీవన విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తమను ఎవరూ పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలోనే తమ కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో భూపంపిణీ వివరాలు ఇలా.. 

రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తుండగా.. కామారెడ్డి జిల్లా ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 528 మంది లబ్ధిదారులకు 12వందల ఆరు ఎకరాల 23 గుంటల ను పంపిణీ చేశారు. ఇందుకోసం 56,28,30,990 రూపాయలను ప్రభుత్వం ఇప్పటి వరకు వెచ్చించింది. మొదటి సంవత్సరం రైతులకు పంట సాగు కోసం ఆర్థిక సహాయంగా రూ.1,94,50,087 ఖర్చు చేసింది. వాటిలో బోర్లు వేయడం కోసం రూ.43,64,540 ఖర్చు చేయగా.. రూ.61,82,500 వ్యయంతో మోటర్లను సమకూర్చారు. విద్యుత్‌ సౌకర్యం కోసం 67 బోర్లకు గాను 17 లక్షల 93 వేల రూపాయలు ఖర్చు చేశారు. 

రెండు పంటలు పండించుకుంటున్నారు.. 

జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 528 మంది లబ్ధిదారుల కోసం 12 వందల ఆరు ఎకరాల 23 గుంటల భూమిని ఖరీదు చేసి పంపిణీ చేశాం. ఇందుకోసం 56,28,30,990 రూపాయలను వెచ్చించాం. మొదటి సంవత్సరం పంట సాగు చేసుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు బోరు మోటర్లు వేసి విద్యుత్‌ సౌకర్యం కల్పించాం. లబ్ధిదారులు రెండు పంటలు పండించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

- బాలయ్య, 

ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా అధికారి, కామారెడ్డి. 

VIDEOS

logo