మంగళవారం 02 మార్చి 2021
Kamareddy - Dec 05, 2020 , 01:07:31

పూర్తికాని రుణ లక్ష్యం

పూర్తికాని రుణ లక్ష్యం

 • బ్యాంకర్ల నిర్లక్ష్యం!
 • అన్నదాతకు అందని పంట రుణాలు
 • అడిగితే కొర్రీలు..అడుగడుగునా నిబంధనలు
 • కామారెడ్డి జిల్లాలో వానకాలం రుణ లక్ష్యం రూ.1,360 కోట్లు.. ఇచ్చింది కేవలం రూ.941 కోట్లు
 • యాసంగి సీజన్‌లో రుణ లక్ష్యం రూ.841 కోట్లు
 • ఇప్పటి వరకు 25శాతం రుణాల పంపిణీ 

అన్నదాతకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుండగా.. బ్యాంకర్లు మాత్రం పంట రుణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వానకాలం, యాసంగి సీజన్లలో నిర్దేశించిన పంట రుణాల లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకర్లు విఫలమవుతున్నారు. సకాలంలో రైతులకు రుణాలు అందజేయాలని ఉన్నతాధి కారులు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వ ఆశయానికి తూట్లుపొడుస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో గత వానకాలం సీజన్‌లో బ్యాంకులకు రూ.1,360 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించగా, బ్యాంకర్లు కేవలం రూ.941 కోట్లు మాత్రమే రుణాలు అందించి చేతులు దులుపుకున్నారు.

-కామారెడ్డి టౌన్‌

 • అడిగితే కొర్రీలు.. అడుగడుగునా నిబంధనలు
 • అన్నదాతకు అందని పంట రుణాలు
 • కామారెడ్డి జిల్లాలో వానకాలం రుణ లక్ష్యం రూ.1,360 కోట్లు
 • ఇచ్చింది కేవలం రూ. 941 కోట్లు
 • యాసంగి సీజన్‌లో రుణ లక్ష్యం రూ.841 కోట్లు
 • ఇప్పటి వరకు 25శాతం రుణాల పంపిణీ

కామారెడ్డి టౌన్‌: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండగా రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. రైతులకు సకాలంలో పంట రుణాలు ఇచ్చి చేయూతనివ్వాలనే ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నాయి. ప్రభుత్వం ఆయా బ్యాంకర్లకు ప్రతిఏటా లక్ష్యాలను నిర్దేశిస్తుంది. కానీ బ్యాంకర్లు మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు పూర్తి స్థాయిలో పంట రుణాలు ఇవ్వడంలేదు. రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బ్యాంకులు బుట్ట దాఖలు చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం పంట రుణాల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడంతో బ్యాంకులపై రైతులకు నమ్మకం లేకుండా పోతోంది. రుణాలను తీసుకునేందుకు బ్యాంకులు నానా కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. గత వానకాలం సీజన్‌లో బ్యాంకులు జిల్లాలో 70 శాతం మాత్రమే రైతులకు పంట రుణాలు అందించాయి. రూ.1,360 కోట్లు రుణ లక్ష్యంగా కాగా కేవలం రూ.941 కోట్లు మాత్రమే రైతులకు అందించారు. పూర్తి స్థాయిలో రుణాలు ఇవ్వకపోవడంతో  రైతులు అప్పులు చేసి పంటలను సాగు చేశారు.

వానకాలంలో రుణ లక్ష్యం రూ.1,360 కోట్లు 

వానకాలం సీజన్‌లో పంట పెట్టుబడి కోసం రూ. 1,360 కోట్ల రుణాలు ఇవ్వాలని అధికార యంత్రాం గం లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ బ్యాంకులు రూ. 941 కోట్లు (70 శాతం) మాత్రమే అందజేశాయి. జిల్లా వ్యాప్తంగా 99 వేల 855 మంది రైతులకు పంట రుణాలు ఇచ్చారు. గతేడాది 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వానకాలంలో రూ.1,205 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యం ఉండగా, రూ. 849కోట్లు మాత్రమే అందజేశారు. 90 వేల 936 మంది రైతులు రుణాలు పొందారు. ప్రతిఏటా రైతులకు రుణాలు ఇవ్వడంతో బ్యాంకర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అప్పులతోనే  ఈ వానకాలం సీజన్‌లో రైతులు విస్తారంగా పంటలను సాగుచేశారు. రుణాల పంపిణీపై బ్యాంకర్ల నుంచి స్పందన కరువవడంతో పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించారు. అప్పులు చేసి పంటలను సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విత్తనాలు, దుక్కులు, కూలీలకు చెల్లింపులు, ఎరువుల కొనుగోలు కోసం ఇబ్బందులు పడాల్సిరావడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకతప్పలేదు. జిల్లాలో ఒక్కో రైతు సుమారు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు అప్పు చేసి పంటలు సాగుచేయాల్సి వస్తోంది. సకాలంలో బ్యాంకర్లు రుణాలు ఇచ్చిఉంటే అప్పులు చేసి ఉండేవారిమి కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

యాసంగిలోనైనా అందేనా!

ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో పాటు భూగర్భ జలాలు సైతం అమాంతం పెరిగాయి.ఈ నేపథ్యంలో యాసంగి సీజన్‌లో విస్తారంగా పంటలు సాగుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు మండలాల్లో యాసంగి పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈసారైనా బ్యాంకర్లు పూర్తి స్థాయిలో పంట రుణాలు  ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు. గతేడాది యాసంగిలో రూ. 804 కోట్ల రుణ లక్ష్యం కాగా రూ.640 కోట్లు ఇచ్చారు. మొత్తం 62 వేల 932 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యం రూ. 841 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటికే యాసంగి పంట రుణాలను బ్యాంకులు రెన్యువల్‌ చేస్తున్నాయి. నిర్దేశించిన లక్ష్యంలో ఎంతమేరకు రుణాలు అందజేస్తాయో వేచి చూడాలి.

లక్ష్యానికనుగుణంగా రుణాలివ్వాలి

కామారెడ్డి జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వాలి. గత వానకాలం సీజన్‌లో 70 శాతం పంట రుణాలను అందించారు. యాసంగి సీజన్‌లో రూ. 841 కోట్లు పంట రుణలక్ష్యంగా  నిర్దేశించాం. ఆయా బ్యాంకులకు సైతం లక్ష్యాలను ఇచ్చాం. యాసంగికి సంబంధించిన పంట రుణాలను రెన్యువల్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే రుణాలు అందజేశారు. ఈ నెలాఖరు వరకు లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచిం చాం.

-రాజేందర్‌రెడ్డి, 

 లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, కామారెడ్డి

VIDEOS

logo