సోమవారం 18 జనవరి 2021
Kamareddy - Dec 04, 2020 , 00:29:28

దళితులపై షబ్బీర్‌ది కపట ప్రేమ!

దళితులపై షబ్బీర్‌ది కపట ప్రేమ!

  • ఆయనకళ్లుండీ చూడలేని ధృతరాష్ర్టుడితో   సమానం
  • విలేకరుల సమావేశంలో కామారెడ్డి జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌

కామారెడ్డి: దళితులపై మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని  కామారెడ్డి జడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి ప్రేమ్‌కుమార్‌ విమర్శించారు. గురువారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీబీపేట మండలం జనగామ గ్రామ సర్పంచ్‌ పాత రాజు సస్పెన్షన్‌పై కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించిన నేపథ్యంలో షబ్బీర్‌అలీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇస్తానని షబ్బీర్‌ మాట ఇచ్చి తప్పారన్నారు. బీబీపేట మండలంలోని మాందాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆయన ఆ గ్రామానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆయన వ్యతిరేకించారన్నారు. తెలంగాణ వస్తే ఇక్కడ లైన్‌మెన్లు, వీఆర్‌ఏ వంటి పోస్టులు ఇస్తారని హేళనగా మాట్లాడారని ఆరోపించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామ గ్రామాన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీలకు నేరుగా నిధులను విడుదల చేస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు షబ్బీర్‌అలీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. షబ్బీర్‌అలీ పరిస్థితి కళ్లుండీ చూడలేని ధృతరాష్ర్టుడిలా మారిందని విమర్శించారు. ఎంత మంది దళిత సర్పంచులను సస్పెండ్‌ చేయించావో తమకు తెలుసని, అందుకే ప్రజలు ఆయనను ఐదు సార్లు ఛీకొట్టారని ఎద్దేవా చేశారు. గ్రామానికి సర్పంచ్‌గా ఉన్న వ్యక్తి సరైన పాలన అందించి మంచి పాలకుడిగా పేరు తెచ్చుకోవాలని జనగామ సర్పంచ్‌ పాత రాజుకు సూచించారు. గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త గోపాల్‌రెడ్డి  చిచ్చు పెడుతున్నారని, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఇండ్లపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించా రు.  బీబీపేట ఎంపీపీ పసులాది బాలమణి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామస్తులకు సుపరిపాలన అం దించాలని పాత రాజుకు సూచించారు. సస్పెన్షన్‌ వ్యవహారంలో కులాన్ని వాడుకోవడం బాధాకరమన్నారు. సమావేశంలో కామారెడ్డి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గ్యార లక్ష్మీ సాయిలు, ఇస్రోజివాడి, శాబ్దిపూర్‌, ఉప్పర్‌పల్లి సర్పంచులు రాజు, పరశురాం, ప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సిద్ధిరాములు, అంబారీపేట ఎంపీటీసీ  పీ.రాజేశ్వర్‌  తదితరులు పాల్గొన్నారు.