శనివారం 23 జనవరి 2021
Kamareddy - Dec 03, 2020 , 00:43:26

‘ధరణి’తో పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌

‘ధరణి’తో పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌

  • కలెక్టర్‌ శరత్‌ 
  • పలు మండలాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పరిశీలన 

బాన్సువాడ రూరల్‌/ నస్రుల్లాబాద్‌ / గాంధారి : ధరణి వెబ్‌సైట్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా, సులువుగా అవుతున్నదని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. జిల్లాలోని పలు మండలాల్లోని తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేస్తున్న తీరును ఆయన పరిశీలించారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, గాంధారి తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ద్వారా భూములు రిజిస్ట్రేషన్‌ చేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు 3,300 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో ఉన్నదని తెలిపారు. గ్రామాల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసి గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం బాన్సువాడ మండలం దేశాయిపేట్‌లోని రైస్‌మిల్లును పరిశీలించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్‌,  తహసీల్దార్లు గంగాధర్‌, ధన్వాల్‌, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. 

గాంధారి మండలంలో పల్లెప్రగతిలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తహసీల్‌ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రైతులతో పాటు ఫౌతి, గిఫ్డ్‌ డీడ్‌ చేసుకునే వారికి ధరణి పోర్టల్‌పై అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని ఆదేశించారు. అర్హులైన రైతులు పంట కల్లాలను నిర్మించుకునే విధంగా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ నాగరాజ్‌గౌడ్‌, ఎంపీడీవో సతీశ్‌, జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌నాయక్‌, ఎంపీపీ రాధాబలరాం నాయక్‌, నాయబ్‌ తహసీల్దార్‌ సంగమేశ్వర్‌, గిర్దావర్‌ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. 


logo