ఆదివారం 24 జనవరి 2021
Kamareddy - Dec 02, 2020 , 00:29:33

ధరణి జోరు

 ధరణి జోరు

కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ధరణి కార్యక్రమం అమలులో కామారెడ్డి జిల్లా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు  మొత్తం 3150 స్లాట్స్‌ బుకింగ్‌ కాగా  3074 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో నిలిచింది. కాగా మరో 76 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కామారెడ్డి తర్వాత 2555 రిజిస్ట్రేషన్లతో రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. 2499 రిజిస్ట్రేషన్లతో నల్గొండ మూడో స్థానంలో నిలువగా కేవలం 38 రిజిస్ట్రేషన్లతో చివరి స్థానంలో మహబూబాబాద్‌ నిలిచింది. ధరణి సేవలు ప్రారంభించిన నాటి నుంచి దూకుడుగా కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తున్నది.  అత్యధిక రిజిస్ట్రేషన్లతో మొదటి స్థానంలో నిలపడంలో  కలెక్టర్‌ శరత్‌ కృషి చాలా ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ గ్రామాల్లో ధరణిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, సమీ క్షా సమావేశాలు నిర్వహించడం, ధరణి ద్వారా త్వరితగతిన రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే విధంగా అధికారులు, సిబ్బందికి అవసరమైన సాంకేతిక సహా యం అందించారు.  

అవగాహన కార్యక్రమాలతో..  

ధరణి పోర్టల్‌ సేవల గురించి గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కామారెడ్డి తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌ తెలిపారు. దీంతో ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు కామారెడ్డి మండలంలో 160 రిజిస్ట్రేషన్లతో జిల్లాలో మూడో స్థానంలో ఉన్నామని, మంగళవారం రోజు పది స్లాట్‌లు బుక్‌ చేసుకోగా మొత్తం రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బుధవారం నాటికి కూడా మరో పది స్లాట్స్‌ బుక్‌ అయ్యాయని అమీన్‌సింగ్‌ తెలిపారు. కాగా రాజంపేట, భిక్కనూరు మండలాల్లో సైతం మంగళవారం ఏడు చొప్పున స్లాట్స్‌, రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రాజంపేట మండలంలో ఇప్పటి వరకు 152 రిజిస్ట్రేషన్లు ధరణి కింద పూర్తయినట్లు తహసీల్దార్‌ మోతీసింగ్‌ తెలిపారు. దోమకొండలో మంగళవారం 12 స్లాట్స్‌ బుక్‌ కాగా 12 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. దోమకొండలో ఇప్పటి వరకు మొత్తం 118 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.logo