గురువారం 28 జనవరి 2021
Kamareddy - Dec 01, 2020 , 01:12:26

భక్తిశ్రద్ధలతో ‘కార్తికపౌర్ణమి’

భక్తిశ్రద్ధలతో ‘కార్తికపౌర్ణమి’

  • ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులు 
  • కిటకిటలాడిన శివాలయాలు
  • పలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు 

నమస్తే తెలంగాణ యంత్రాంగం : కార్తికపౌర్ణమిని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో ఉన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు ఉదయం, సాయంత్రం ఆలయాల్లో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఇంటి వద్ద తులసి కోటను పూలతో అందంగా అలంకరించి తులసీ వివాహాలు జరిపించారు. దీపాలు వెలిగించారు. పలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. 

మద్నూర్‌ మండలంలోని కొడిచిర శివారులో ఉన్న చెన్నమ్మకోరి ఆలయంలో మహిళలు పూజలు చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నుంచి భక్తులు నడిచారు. ఆలయ ప్రాంగణంలోని బావి వద్ద పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అన్నదానం చేశారు. నిజాంసాగర్‌లోని చంద్రమౌళీశ్వర ఆలయంలో వేకువజామున నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్నప్రముఖ ఆలయాల్లో మహిళలు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. 

కామారెడ్డి మండల పరిధిలోని సరస్వతీ మాత ఆలయంతో పాటు రామాలయం, చిన్నమల్లారెడ్డిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దోమకొండలోని చాముండేశ్వరి, శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. ఆలయాల్లో అర్చకుల ఆధ్వర్యంలో పూజలు కొనసాగాయి. ఎల్లారెడ్డిలోని నీలకంఠేశ్వరాలయానికి వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని జ్యోతిర్లింగాలు, తులసి కోట, నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలను వెలిగించి పూజలు చేశారు. సదాశివనగర్‌ మండలం లింగంపల్లిలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఎంపీపీ గైని అనసూయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తిక పౌర్ణమి సందర్భంగా దీపాలను వెలిగించారు. రామారెడ్డి మండలకేంద్రంలో రామసేవా సమితి సభ్యులు బస్టాండ్‌ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రామసేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. లింగంపేటలోని నగరేశ్వర ఆలయం, శివాలయం, జోగినాథ, సాయిబాబా ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించారు. పూజలు నిర్వహించారు. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయినులు, విద్యార్థులు దీపాలను వెలిగించారు. తాడ్వాయి, సంతాయిపేట శబరిమాత ఆశ్రమాల్లో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామంలోని సిద్ధుల గుట్టపై పూజలు నిర్వహించారు. 

కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్‌లో ఉన్న శివాలయంలో అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు లక్ష దీపారాధన నిర్వహించారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని శారదాదేవి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. గాంధారి మండలంలోని గుడిమెట్‌ సమీపంలో ఉన్న మహాదేవుని గుట్టపై లక్షదీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. logo