గురువారం 28 జనవరి 2021
Kamareddy - Nov 24, 2020 , 00:38:46

టీఆర్‌ఎస్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో 
  •  ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు

నిజాంసాగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం గోషామహల్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఖేశ్‌సింగ్‌ తరఫున ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడానికి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో భాగంగా హోటల్‌లో దోశలు వేసి, కూరగాయల దుకాణంలో టమాటలు తూకం వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. 

చింతల్‌ డివిజన్‌లో ఎమ్మెల్సీ బాజిరెడ్డి ప్రచారం

జక్రాన్‌పల్లి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న చింతల్‌ డివిజన్‌లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎమ్మెల్యేతో కలిసి జక్రాన్‌పల్లి మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. చింతల్‌లో 128 డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రషీద్‌ బేగంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు డి. శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ అనంత్‌రెడ్డి, బ్రాహ్మణపల్లి, లక్ష్మాపూర్‌, నడిమితండా సర్పంచులు లత దేవరాజ్‌, కైలాస్‌ నాయక్‌, మోహన్‌ నాయక్‌, ఎంపీటీసీలు గడ్డం గంగారెడ్డి, మరియా సతీశ్‌, పి. రాజు, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి: డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ: హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసే సత్తా కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ఉందని ఉమ్మడి నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్‌ 131 డివిజన్‌ పరిధిలోని వాజ్‌ బాయి, దత్తాత్రేయ నగర్‌ కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పారిజాత గౌరీశ్‌కు ఓటు వేయాలని కోరారు. బస్తీల అభివృద్ధి, సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ప్రచారంలో బాన్సువాడ టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌  దుద్దాల అంజిరెడ్డి, నాయకులు దొడ్ల వెంకట్రామ్‌ రెడ్డి, ఎజాస్‌, ముఖీద్‌, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, ఏఎంసీ చైర్మన్‌ పాత బాలు  పాల్గొన్నారు.

ఇంటి పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి 

ఆర్మూర్‌ : తెలంగాణ రాష్ర్టాన్ని  పోరాడి సాధించిన ఇంటి పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని సురారం 129వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సత్యనారాయణతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు. అంతకుముందు ఆర్మూర్‌ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులతో సురారం డివిజన్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చిన వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో  టీఆర్‌ఎస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో సబ్బండ వర్ణాల అభ్యున్నతికి పెద్దపీట వేశారని అన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. 


logo