బుధవారం 02 డిసెంబర్ 2020
Kamareddy - Oct 31, 2020 , 00:33:43

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

భారీ ర్యాలీలు నిర్వహించిన ముస్లిములు

పలుచోట్ల అన్నదానాలు 

బీర్కూర్‌ / ఎల్లారెడ్డి రూరల్‌/లింగంపేట/బాన్సువాడ/విద్యానగర్‌ : మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ముస్లిములు మిలాద్‌ ఉల్‌ నబీని శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. గురువారం రాత్రి నుంచి పలువురు ఉపవాసం ఉన్నారు. శుక్రవారం పలు ప్రాంతాల్లో పేదలకు ముస్లిములు పండ్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. 

బీర్కూర్‌లోని గాంధీచౌక్‌లో ముస్లిములు ఒకేచోట పండుగను నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించినట్లు మతపెద్దలు తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని వివిధ వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. లింగంపేటలో ర్యాలీని బస్టాండ్‌ మీదుగా సబ్‌స్టేషన్‌ సమీపంలోని మసీదు వరకు నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని ప్రాంతీయ ఏరియా దవాఖానలో జమైతుల్‌ ఉలామా హిందూ మండల శాఖ ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం దవాఖాన సూపరింటెడెంట్‌ శ్రీనివాస్‌ప్రసాద్‌ను ముస్లిములు సన్మానించారు. షాదీఖాన కమిటీ చైర్మన్‌ అబ్దుల్‌ వాహబ్‌, టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడు యూసూఫ్‌, మాజీ వార్డు మెంబర్‌ అక్బర్‌ ఆధ్వర్యంలో ఇస్లాంపూర్‌ లోని నూర్‌ మసీదు నుంచి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నూర్‌ మసీదు అధ్యక్షుడు ఆరిఫ్‌, సీనియర్‌ నాయకులు మహ్మద్‌ ఎజాస్‌,  జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు  అలీమొద్దిన్‌ బాబా,  మాజీ సభ్యుడు అలీ బిన్‌ అబ్దుల్లా, మాజీ ఉపసర్పంచ్‌ ఖాలిక్‌,  అఫ్రోజ్‌, నసీమొద్దీన్‌ పాల్గొన్నారు. 

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ముస్లిములు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంజద్‌, మాజిద్‌, అమీర్‌, ఫైసల్‌, నవీద్‌ తదితరులు పాల్గొన్నారు.