గురువారం 03 డిసెంబర్ 2020
Kamareddy - Oct 29, 2020 , 00:43:51

పలు గ్రామాల్లో కరోనాపై అవగాహన

పలు గ్రామాల్లో కరోనాపై అవగాహన

నిజాంసాగర్‌/ పిట్లం / గాంధారి /ఎల్లారెడ్డిరూరల్‌: నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ భవనంలో మండల ఆరోగ్యశాఖ అధికారి రాధాకిషన్‌ మండల సమాఖ్య సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలకు కరోనాపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మి, ఏపీఎం రామ్‌నారాయణగౌడ్‌ పాల్గొన్నారు. 

పిట్లం మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో, ప్రభుత్వ దవాఖానలో మండల వైద్యాధికారి శివకుమార్‌ కరోనాపై అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం శిరీష, పీఎంపీ, ఆర్‌ఎంపీలు రాములు, సుభాష్‌ సితాలే, రఘు, మెడికల్‌ షాప్‌ యజమానులు యాదగిరి, ఆనంద్‌, శ్రీనివాస్‌, ల్యాబ్‌ నిర్వాహకులు రమణాగౌడ్‌, పిట్లం వైద్యాధికారులు రోహిత్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గాంధారి మండలంలోని తిప్పారంతండాలో గాంధారి ప్రభుత్వ దవాఖాన సిబ్బంది కరోనాపై అవగాహన కల్పించారు. దగ్గు, జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు ఉంటే కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం దేవి, సర్పంచ్‌ సుందరీబాయి, ఉత్తునూర్‌ విండో డైరెక్టర్‌ బిషన్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ గంగారాం, పంచాయతీ కార్యదర్శి సుష్మ, అంగన్‌వాడీ టీచర్‌ శారద, ఆశవర్కర్‌ భాగ్య పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో మత్తమాల మెడికల్‌ ఆఫీసర్‌ వెంకటస్వామి కరోనాపై అవగాహన కల్పించారు. చలికాలంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని, ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలని అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అంగన్‌వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు, గ్రామసంఘాల వీవోఏలు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఐకేపీ ఏపీఎం ప్రసన్నరాణి, సీడీపీవో సరిత, ఐసీడీఎస్‌, హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఐకేపీ సీసీఎస్‌లు, వివిధ గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

కరోనా బాధితులకు సూచనలు చేసిన వైద్యాధికారి  

ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి, సాతెల్లి గ్రామాల్లో కరోనా బారిన పడిన వారికి మత్తమాల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వెంకటస్వామి పలు సూచనలు చేశారు. భౌతికదూరం పాటించాలని, వైద్యులు సూచించిన విధంగా మందులు వాడాలని వారికి అవగాహన కల్పించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.