సోమవారం 30 నవంబర్ 2020
Kamareddy - Oct 27, 2020 , 00:23:11

వైభవంగా శోభాయాత్ర

వైభవంగా శోభాయాత్ర

భక్తిశ్రద్ధలతో  దేవీ విగ్రహాల నిమజ్జనోత్సవం

ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న దుర్గాదేవి గంగమ్మ చెంతకు చేరింది. జిల్లాలోని బీర్కూర్‌, బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, గాంధా రి, నిజాంసాగర్‌, బీబీపేట  మండలాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాలను సోమవారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా చేపట్టిన   శోభాయాత్ర వైభవంగా కొనసాగింది.  బాన్సువాడ మండలం   ఇబ్రహీంపేట్‌ గ్రామం లో నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రలో మహిళలు కోలాటాలు ఆడగా, యువకులు నృత్యాలు చేశారు. నిమజ్జనం సందర్భంగా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని  ఏర్పాటు చేశారు.  నస్రుల్లాబాద్‌లో చిన్నారులు దాండియా ఆడి సందడి చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రకు మంగళహారతులతో స్వాగతం పలికారు.  గాంధారి మండల కేంద్రంలో ‘శివ హిందూ సేన’ ఆధ్వర్యంలో  అమ్మవారి మండపం వద్ద లడ్డూ వేలం వేయగా.. రూ.75 వేలకు దేవేందర్‌, నరేశ్‌ దక్కించుకున్నా రు. గండివేట్‌ గ్రామంలో అమ్మవారి లడ్డూను  వేలం వేయ గా గ్రామానికి చెందిన ఓలామ ఆసిఫ్‌ 6,666 రూపా యలకు దక్కించుకున్నారు. నిజాంసాగర్‌ మండలం  మా గి, మహ్మద్‌నగర్‌, గోర్గల్‌ గ్రామాల్లో మహిళలు దాండియా ఆడుతూ శోభాయాత్ర నిర్వహించారు. మహ్మద్‌నగర్‌లో దుర్గామాత కలశాన్ని  వేలం వేయగా.. బుర్గుల్‌ గ్రామానికి చెందిన నారాయణ 19,100 రూపాయలకు దక్కించుకున్నారు. లడ్డూలను గ్రామానికి చెందిన రాజయ్య, శ్రీనివాస్‌రెడ్డి దక్కించుకున్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలోని శారదాదేవి ఆలయంలో అమ్మవారికి నిజస్వరూప దివ్యాలంకరణం, భక్తులకు మహా నివేదన, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించారు. భారత్‌ రోడ్‌లో దుర్గామాత శోభాయాత్ర నిర్వహించి టేక్రియాల్‌ చెరువులో నిమజ్జనం చేశారు.