శుక్రవారం 04 డిసెంబర్ 2020
Kamareddy - Oct 27, 2020 , 00:20:37

ఔషధగుణాల.. మునగ

ఔషధగుణాల.. మునగ

పుష్కలంగా పోషక విలువలు

ఆరోగ్యానికి ఎంతో మేలు 

అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి

హరితహారంలో విరివిగా పంపిణీ

ఔషధగుణాలు పుష్కలంగా ఉన్న చెట్టల్లో మునగ అన్నింటికంటే మెరుగైనదంటారు వైద్యులు, ఆహార నిపుణులు. 5వేల సంవత్సరాల క్రితమే ఈ చెట్టును గుర్తించినట్లు తెలుస్తున్నది. మునగ ఆకులు, పూలు, కాయల్లోనూ వ్యాధులను తగ్గించే శక్తి ఉంది. సన్నగా, పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే ఈ చెట్టు ఆరు నెలల్లోనే కాతకు వస్తుంది. దీని కాయ 50 సెంమీ పొడవు, 1-2 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి.

మనం కూరల్లో వాడే మునగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాయలోనే కాదు.. మునగాకు పొడిలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తే శక్తి దీనికుంది. 96 పోషక విలువలతో ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే ఈ మొక్కలను ఇటీవల రాష్ట్ర సర్కారు హరితహారంలోనూ విరివిరిగా పంపిణీ చేసింది.                              

మునగకాయలో వ్యాధులను నయం చేసే శక్తితో పాటు పుష్కలంగా విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి. మనం నిత్యం తీసుకొనే పండ్లలో ఉండే వాటి కన్నా రెట్టింపు మేలుచేసే గుణం వీటికి ఉంది.

100 గ్రాముల మునగాకుల్లోని మిటమిన్‌-సీ నారింజల్లో కన్నా 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. క్యారెట్‌లోని కాల్షియం కంటే 4 రెట్లు, అరటిపండ్లలోని పొటాషియం  కంటే 3 రెట్లు, పాలకూరలోని ఐరన్‌కు 3 రెట్లు, బాదాంలోని విటమిన్‌-ఈ కి 3 రెట్లు, పెరుగులోని ప్రొటీన్ల కంటే రెండింతలు మునగాకుల్లో ఉంటాయి.

96 షోషక విలువలు కలిగిన మునగచెట్టుతో 300 రకాల వ్యాధులు నయమవుతాయి.

మునగలోని విటమిన్‌-సీ జలుబు, జ్వరానికి మాత్రలా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

పొట్టలో నులిపురుగుల బాధ మటుమాయం అవుతుంది. మునగకాయలు ఉడికించిన సూప్‌ తాగితే డయేరియా, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

టీ స్పూన్‌ మునగాకు పొడిని ప్రతిరోజూ వేడి వేడి అన్నంతో తింటే శరీరంలో ఐరన్‌ వృద్ధి చెందుతుంది. కంటి జబ్బులు, రేచీకటి సమస్య పోతుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ చెబుతోంది.

మునగ ఆకులతో క్యాన్సర్‌, అల్సర్‌, బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరిచేరవు.

మునగకాయలు తినేవాళ్లలో రోగ నిరోధక శక్తి ఎక్కువ. శ్వాస సంబంధ సమస్యలు ఉండవు. నాడీ వ్యవస్థ మంచిగా పని చేస్తుంది.

మునగ చెట్టు బెరడు, వేర్లు, ఆకులు, కాయలు, విత్తనాలు, పూలను చాలా దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాల్లో వాడుతున్నారు.