శనివారం 05 డిసెంబర్ 2020
Kamareddy - Oct 27, 2020 , 00:16:56

నోరూరించే సపోటా

నోరూరించే సపోటా

రుచికే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

పలు రుగ్మతలకు చక్కని పరిష్కారం

ఎన్నో పోషక విలువలు

ఎల్లారెడ్డి రూరల్‌ : 

సపోటా పండు.. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ఎంతో తియ్యగానూ ఉంటుంది. దీనికి మరో పేరు ‘చికూ’. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. నీరసం తొలిగి పనిచేయడానికి అవసరమయ్యే శక్తినిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. సపోటాలో పుష్కలంగా లభించే కెరోటిన్‌ కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఈ పండులో గ్లూకోజ్‌, విటమిన్‌ సీ, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. సపోటా తేలికగా జీర్ణమవుతుంది. అందువల్ల చిన్నపిల్లలు, వృద్ధులు కూడా తినొచ్చు. ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. రాగి కూడా స్వల్ప శాతంలో ఉంటుంది. గంధకం, క్లోరిన్‌ కూడా లభిస్తాయి. కొవ్వు పదార్థం, పిండి పదార్థం, నీరు, పీచు పదార్థం సపోటాలో ఉంటాయి. పోషక విలువలున్న ఈ పండును తీసుకోవడం ద్వారా ఆరోగ్యం పెంపొందడమే కాకుండా రక్తవృద్ధి కూడా కలుగుతుంది.

సపోటాతో ప్రయోజనాలు

 • n సపోటా గుజ్జులో ఉండే ఫైబర్లు మలబద్ధకం లేకుండా చేస్తాయి.
 • n జీర్ణాశయ క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటుంది.
 • n శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్‌ లభిస్తుంది.
 • n నిద్రలేమి, ఆందోళనతో బాధపడే వారు సపోటా తినడం మంచిది.
 • n జలుబు, దగ్గు సమస్యలకు మంచి ఔషధం.
 • n కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యలకు చెక్‌ పెడుతుంది.
 • n స్థూలకాయ సమస్యకు విరుగుడుగా పనిచేస్తుంది. 
 • n విటమిన్‌ ఏతో కంటి సమస్యలు దూరమవుతాయి.
 • n వృద్ధాప్యంలో అంధత్వ నివారణకు తోడ్పడుతుంది.
 • n విటమిన్‌ బీ, సీతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
 • n సపోటాలో ఉండే పిండి పదార్థాలు గర్భిణులు, బాలింతలకు ఎంతో మేలు చేస్తాయి.
 • n ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్‌, కాపర్‌, ఐరన్‌ వంటి మూలకాలు సపోటాలో అనేకం ఉన్నాయి.
 • n నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుంది.
 • n సపోటా జ్యూస్‌ను రోజూ తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది.
 • n జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.
 • n చండ్రు సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

శక్తికి మూలం

సపోటాలో సుక్రోజ్‌ ఎక్కువ. ఇది వెంటనే శక్తిని ఇస్తుంది. పని చేస్తూ అలసిపోయినవాళ్లు రెండు సపోటాపండ్లు తింటే చాలు వెంటనే వారికి కావాల్సినంత ఎనర్జీ వస్తుంది.

యాంటీ ఇన్‌ఫ్లామేటరీగా.. 

శరీరంలో వేడి పెరిగిపోతే సపోటాలు తినాలి. వీటిలోని టాన్నిన్‌ వేడిని పోగొట్టి చలువ చేస్తుంది. అందుకే వేడి శరీరం ఉన్నవారు వీటిని తరచూ తినాలి. ఇది ఎటువంటి వాపునైనా, నొప్పినైనా తగ్గించడం ద్వారా మంటను తగ్గిస్తుంది.

ఎముకల దృఢత్వానికి..

సపోటాలో కాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. సపోటాలను తరచూ తింటే వృద్ధాప్యంలో మందులు ఎక్కువగా వాడాల్సిన పని ఉండదు. సపోటాల్లోని ఫోలేట్స్‌, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, జింక్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, సెలెనియం ఎముకలను ధృడంగా చేస్తాయి.

క్యాన్సర్లను నివారణకు..

వీటిలోని ఏబీ, విటమిన్లు శరీరంలోని శ్లేష్మ క్రమీకరణకు, చర్మం, ఆరోగ్య నిర్మాణ నిర్వహణకు సహాయపడుతాయి. సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు, పోషకాలు క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. విటమిన్‌ ఏ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ నుంచి రక్షణను ఇస్తుంది.

బరువు తగ్గాలంటే..

బరువు తగ్గాలంటే శరీరంలో వాటర్‌ ఉండాలి. మెటబాలిజం సరిగ్గా ఉండాలి. ఆ పనిని సపోటాలు చేస్తాయి. ఓ రెండు సపోటాలు తిని వర్కవుట్‌ చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

బ్యూటీ బెనిఫిట్స్‌ అనేకం

అందంగా, కోమలంగా, మచ్చలు, మొటిమలు, కురుపులు వంటివి పోయి చర్మం నిగనిగలాడాలంటే సపోటాలు ఎంతో సహాయం చేస్తాయి. ఇవి చర్మం, జుట్టును కాపాడుతాయి. విష వ్యర్థాలు ఉంటే శరీరం నుంచి బయటకు వెళ్లి పోయే వరకు సపోటా పనిచేస్తుంది. ముఖ్యంగా చర్మంపై వచ్చే ముడతలను రాకుండా కాపాడడంలో సపోటా ప్రముఖపాత్ర వహిస్తుంది. అందుకే చాలా మంది సపోటాలను హ్యాపీ ఫ్రూట్‌ అంటారు.

బీపీ నియంత్రణకు..

సపోటాలోని మెగ్రీషియం రక్తనాళాలను చురుగ్గా ఉండేలా చేస్తుంది. పోటాషియం బీపీని నియంత్రిస్తుంది. రక్తం సరిగ్గా లేని వారు సపోటా పండ్లను తినాలి.

రక్తస్రావాన్ని అరికడుతుంది

సపోటా మూలిక రక్తస్రావాన్ని అరికడుతుంది. అంటే రక్తస్రావం అరికట్టేందుకు తోడ్పడే లక్షణాన్నీ కలిగి ఉంటుంది. దెబ్బలు తగిలినప్పుడు దీన్ని వాడుతారు. పురుగులు కుట్టినప్పుడు నేలలోని విత్తనాల పేస్ట్‌ను ఉపయోగిస్తారు. 


ఒత్తిడి నియంత్రణకు సపోటా

అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంతో సపోటా ఎంతగానో దోహదపడుతుంది. ఇది శక్తిమంతమైన ఉపశమనకారి. ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో ఉపకరిస్తుంది. నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడేవారు సపోటా పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. దీర్ఘకాల దగ్గును నివారించడానికి సహాయపడుతుంది. 

-వెంకటస్వామి, 

మెడికల్‌ ఆఫీసర్‌, మత్తమాల పీహెచ్‌సీ