'కోడి'కి రెక్కలు పెరిగిన చికెన్ ధరలు.. అదే దారిలో మటన్, చేపలు

కోడిగుడ్ల వినియోగం నాలుగింతలు
కరోనా నేపథ్యంలో నాన్‌వెజ్‌కు డిమాండ్
ఎల్లారెడ్డి రూరల్ :
కరోనా బారినపడకుండా ఉండేందుకు ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యులు చెప్పిన సూచనలు, సోషల్ మీడియాలో వచ్చిన సలహాలను పాటిస్తున్నారు. ఇప్పటికే మాస్కులు, శానిటైజర్లను వినియోగిస్తున్న ప్రజలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్, జింక్ ఇతర మాత్రలను విరివిగా వాడుతుండడంతో మెడికల్ దుకాణాల్లో గిరాకీ పెరిగిపోయింది. పోషకాలతో కూడిన ఆహారం, ప్రొటీన్లు అధికంగా లభించే గుడ్లు, చికెన్, మటన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. కరోనా దేశంలోకి రాకముందు వినియోగంతో పోలిస్తే ప్రస్తుత వినియోగం నాలుగింతలైంది. చికెన్, మటన్, కోడిగుడ్లు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందంటున్న వైద్యుల సూచనలతో నాన్‌వెజ్‌పై మనసు పారేసుకుంటున్నారు. కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోతుండడంతో ఎక్కువ మంది నాన్‌వెజ్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ధరలకు రెక్కలు
కరోనా ప్రభావంతో నాన్‌వెజ్ వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో వాటి ధరలు సైతం అమాంతంగా పెరిగాయి. ప్రస్తుతం చికెన్ కిలో (స్కిన్లెస్)కు రూ.220 వరకు, విత్ స్కిన్ రూ.200 వరకు, గుడ్లు డజన్‌కు రూ.70 వరకు ధరలు పలుకుతున్నాయి. మటన్ అయితే కిలోకు రూ.600 వరకు విక్రయిస్తున్నారు.
పెరిగిన వినియోగం
చికెన్, మటన్ వినియోగం అమాంతం పెరిగింది. గతంలో నెలలో రెండు మూడు సార్లు మాత్రమే చికెన్, మటన్ వండుకునేవారు. ప్రస్తుతం పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ నాన్‌వెజ్ వాడకం విపరీతంగా పెరిగింది. వారంలో రెండుమూడ్రోజులు మాంసాహారాన్ని తీసుకుంటున్నారు. బాయిల్ చికెన్ కన్నా నాటుకోడి మాంసానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గొర్రె మాంసంలో పోషకాలు ఉంటాయంటున్నారు వైద్యులు. అయితే వారంలో రెండు రోజులు తీసుకోవాలని, అతిగా తింటే లేని సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.
పోషకాల కోసమే..
కరోనా వైరస్‌ను తట్టుకోవాలంటే ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే చికెన్, మటన్, గుడ్లు తినాలని, వాటిని తింటే ఆరోగ్యంగా ఉంటారని, వేగంగా కోలుకుంటారని వైద్యులు సూచిస్తుండడంతో విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మాంసాహారం వినియోగం అమాంతం పెరగడంతో ధరలకు సైతం రెక్కలొచ్చాయి. ముఖ్యంగా గుడ్ల వాడకం విపరీతంగా పెరిగింది. కరోనాకు అంతకుముందు డజన్ల చొప్పున ఖరీదు చేసేవారు. ప్రస్తుతం ట్రే చొప్పున ఖరీదు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు. గుడ్లలోని తెల్లటి సొనలో ఇమ్యునోగ్లోబ్లోయిన్స్ పోషకాలు ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. ఇక మాంసాహారంలో కన్నా ఉడికించిన గుడ్లలో ఇవి ఎక్కువగా ఉంటాయని వైద్యులు ధ్రువీకరిస్తున్నారు.
అప్పుడు నష్టపోయాం..
కరోనా వైరస్ కారణంగా మార్చి, ఏప్రిల్‌లో కొనేవారు లేక చాలా తక్కువ ధరకే చికెన్ విక్రయించాం. కోళ్లు ఎక్కువగా ఉండడంతో రోజువారి ఖర్చులు వెళ్లని పరిస్థితుల్లో ఉచితంగా పంపిణీ చేశాం. ప్రస్తుతం గుడ్లు, చికెన్, మటన్ తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందని తెలియడంతో వ్యాపారం ఒక్కసారిగా పుంజుకుంది. ప్రస్తుతం కిలో చికెన్ రూ.200 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నాం.
-రాజు, చికెన్ సెంటర్ యజమాని, ఎల్లారెడ్డి
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని..
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పడంతో గుడ్లు, చికెన్, మటన్, ఫిష్ వంటి ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాం. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు నాన్‌వెజ్ తింటున్నాం. ఇంట్లోని పిల్లలు, పెద్దలందరూ ప్రతి రోజూ గుడ్డ తప్పకుండా తీసుకుంటున్నారు. మొదట్లో కరోనా వస్తుందనడంతో అప్పుడు తినలేదు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు నాన్‌వెజ్ ఎక్కువగా తింటున్నాం.
-గంజి గంగాధర్, వస్త్రవ్యాపారి, ఎల్లారెడ్డి
ఆరోగ్యానికి మేలు
కరోనా బారిన పడినా, పడకుండా ఉండాలన్నా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం ప్రధానం. ఇమ్యూనిటీ కోసం కోడిగుడ్లు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి రోజులో రెండు నుంచి నాలుగు ఉడికించిన గుడ్లు తినొచ్చు. మాంసంలో ప్రొటీన్లు సైతం లభిస్తాయి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఆస్తమా, బీపీ, షుగర్, కిడ్నీ, గుండెజబ్బులు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
-వెంకటస్వామి, మత్తమాల పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్
తాజావార్తలు
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
- వారంలో రూ.1.97లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్
- చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్