గురువారం 28 జనవరి 2021
Kamareddy - Oct 15, 2020 , 02:00:35

ప్రాజెక్టులకు వరద ఉధృతి

ప్రాజెక్టులకు వరద ఉధృతి

మెండోరా / ఎల్లారెడ్డి రూరల్‌ / నిజాంసాగర్‌ / నాగిరెడ్డిపేట / ధర్పల్లి : ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. పలు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా మిగులు జలాలను వరద గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వరద ఉధృతి తగ్గడంతో ఎస్సారెస్పీ గేట్లను బుధవారం సాయంత్రం 5 గంటలకు మూసివేశారు. ఉదయం 3.40 గంటలకు ఎనిమిది వరద గేట్లతో 25 వేల క్యూసెక్కులు, 9 గంటలకు నాలుగు గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం అన్ని గేట్లను పూర్తిగా మూసేసినట్లు డీఈ జగదీశ్‌ తెలిపారు. ఎస్కేప్‌ గేట్ల నుంచి 5,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 500, వరద కాలువకు 3 వేలు, లక్ష్మీ కాలువకు 300, సరస్వతీ కాలువకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి, లీకేజీ రూపంలో 691 క్యూసెక్కులు, మిషన్‌భగీరథ తాగు నీటి కోసం 152 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1090.60 అడుగులు (88.11 టీఎంసీలు) ఉంది. 

కళ్యాణి ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

కళ్యాణి ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 250 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్‌ ఆయకట్టుకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 409.20 మీటర్ల నీరు నిల్వ ఉంది. 

కౌలాస్‌నాలా ఆరు గేట్ల ఎత్తివేత

జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి 9090 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. బుధవారం సాయంత్రానికి 458.00 మీటర్లు 1.237 టీఎంసీల పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉండగా ఆరు వరద గేట్ల ద్వారా ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ రాజ్‌కమల్‌ తెలిపారు.  

పొంగి పొర్లుతున్న పోచారం 

నాగిరెడ్డిపేట్‌ మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ఐదు రోజులుగా కరుస్తున్న వర్షానికి ప్రాజెక్టు పొంగి పొర్లుతున్నది. 6,348 క్యూసెక్కుల వరద వస్తోందని డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. జాన్కంపల్లి చెరువు పూర్తి స్థాయిలో నిండడంతో అలుగు పారుతోంది. 

రామడుగుకు జలకళ

ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టులోకి 160 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందని ఏఈ సునీల్‌ నాయక్‌ తెలిపారు. ప్రాజెక్టు అందాలు చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.logo