శనివారం 31 అక్టోబర్ 2020
Kamareddy - Sep 27, 2020 , 02:13:48

ఎస్సారెస్పీకి 93,913 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీకి 93,913 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మెండోరా: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శనివారం 93,913 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని ప్రాజెక్టు డీఈ జగదీశ్‌ తెలిపారు. దీంతో ఉదయం ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 75 వేల క్యూసెక్కులు, మధ్యాహ్నం మూడున్నర గంటలకు 26 వరద గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కుల మిగులు జలాలను గోదావరి నదిలోకి వదిలినట్లు తెలిపారు. ఈ సీజనులో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 213.80 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు.  ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి 1090.80 అడగుల(89.21 టీఎంసీల) నీటినిల్వ ఉందన్నారు. 

కౌలాస్‌నాలా ఆరు గేట్ల ఎత్తివేత 

నిజాంసాగర్‌: ఎగువ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కౌలాన్‌నాలా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈ రాజ్‌కమల్‌ శనివారం తెలిపారు. ప్రాజెక్టులోకి 12,380 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 2,848 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని, ప్రాజెక్టులో శనివారం సాయంత్రం వరకు 6.695 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని ప్రాజెక్టు డీఈఈ దత్రాత్రి తెలిపారు. నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తుంకిపల్లి రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.