శుక్రవారం 30 అక్టోబర్ 2020
Kamareddy - Sep 27, 2020 , 02:13:50

గ్రామాలకు నూతన కళ

గ్రామాలకు నూతన కళ

ధర్పల్లి : ఏ పథకమైనా పాలకుల అంకితభావం, ప్రజల భాగస్వామ్యం ఉంటే వందశాతం అనుకున్న ఫలితాలను సాధించవచ్చనేందుకు పల్లెప్రగతి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలన్నీ పరిశుభ్రతకు నోచుకుని, పచ్చని చెట్లు, పరిశుభ్రమైన రోడ్లు, పరిసరాలతో కళకళలాడుతున్నాయి. ఎన్ని నిధులు కేటాయించినా జరగని చిన్నచిన్న పనులు ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతి ద్వారా పూర్తయ్యాయి. మండలంలోని 22 గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. అద్దాల్లా మెరుస్తున్న రోడ్లు.. రోడ్లకిరువైపులా నాటిన పచ్చని మొక్కలతో గ్రామాలకు కొత్త కళవచ్చింది. మండల కేంత్రంతోపాటు సీతాయిపేట్‌, చల్లగర్గె, మైలారం, దుబ్బాక, దమ్మన్నపేట్‌, మద్దుల్‌ తండా, వాడి తదితర గ్రామాలు నూతనకళను సంతరించుకున్నా యి. జిల్లా వ్యాప్తంగా ఎంపికైన 70 ఆదర్శగ్రామాల్లో ధర్పల్లి, సీతాయిపేట్‌, వాడి, దుబ్బాక గ్రామాలున్నాయి. వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం, మురికికాలువల నిర్వహణ, తాగునీటి సరఫరా, మొక్కల సంరక్షణ తదితర పనులను పకడ్బందీగా చేపట్టడంతో పల్లెల్లో పచ్చని, పరిశుభ్ర వాతావరణం కనిపిస్తున్నది. 

కంటికిరెప్పలా మొక్కల సంరక్షణ..

హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. నాటిన మొక్కల్లో  కనీసం 80 శాతం మొక్కలు బతకాలన్న నిబంధనను ప్రభుత్వం విధించడంతో సర్పంచులు, కార్యదర్శులు మొక్కల సంరక్షణ పనులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లతో మొక్కలకు నీళ్లుపట్టిస్తున్నారు.  

అందరి సహకారంతోనే..

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ధర్పల్లిని ఆదర్శగ్రామంగా నిలి పాం. ఇది అందరి సహకారంతోనే సాధ్యమైంది. ప్రజాప్రతినిధులు, ప్రజలు, పంచాయతీ సిబ్బంది పల్లెప్రగతిలో భాగస్వాములయ్యారు. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగేలా చూస్తాం. 

     -ఆర్మూర్‌ పెద్ద బాల్‌రాజ్‌, సర్పంచ్‌, ధర్పల్లి

గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాం

గ్రామంలోని యువకులు, డ్వాక్రా సంఘాల మహిళలు, గ్రామస్తుల సహకారంతో పల్లెప్రగతి ద్వారా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. ఒకప్పటి గ్రామానికి, ప్రస్తుత గ్రామానికి ఎంతో తేడా ఉంది. పచ్చదనం, పరిశుభ్రత చూస్తే ఆనందంగా ఉంది. ఇదంతా గ్రామస్తుల భాగస్వామ్యం వారి సహకారంతోనే సాధ్యమైంది. పరిశుభ్రత, పచ్చదనం ఇలాగే కొనసాగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

-లొక్కిడి విజయరాములు, సర్పంచ్‌, సీతాయిపేట్‌

ప్రతిరోజూ ‘పల్లె ప్రగతి’

పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో ఎంతో మార్పువచ్చిం ది. ప్రతిరోజూ పల్లెప్రగతి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాం. గ్రామస్తులకు పూర్తి అవగాహన కల్పించాం. దీంతో చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయడం లేదు. అభివృద్ధికి, పారిశుద్ధ్య నిర్వహణకు ఎంతో సహకరిస్తున్నారు. 

 -ఎస్‌.వెంకటేశ్‌,  సర్పంచ్‌, దుబ్బాక