మంగళవారం 20 అక్టోబర్ 2020
Kamareddy - Sep 11, 2020 , 03:05:08

రెండు కాదు.. మూడు గ్రూపులు..!

రెండు కాదు.. మూడు గ్రూపులు..!

  • n భారతీయ జనతా పార్టీలో తీవ్రమవుతున్న ఇంటి పోరు 
  • n బండి సంజయ్‌ ముందే బహిర్గతమైన కుమ్ములాటలు 
  • n బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలోనే తేటతెల్లం 
  • n ఎంపీ అర్వింద్‌ వర్సెస్‌ యెండల వర్సెస్‌ గుప్తా పేరిట చీలికలు 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కమలం పార్టీ వీడి కారెక్కుతున్న నేతలతో బీజేపీ ఇందూరు శాఖ కుదేలవుతున్నది. రోజురోజుకూ పార్టీ నేతలను కాపాడుకోలేక సతమతం అవుతున్నది. ఇప్పటికే పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకుంటుండగా ఆ పార్టీలో కొనసాగుతున్న వారు ప్రత్యామ్నాయాల వైపు ఆలోచన చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో కుమ్ములాట సంస్కృతి ఇందూర్‌ శాఖలో రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజ ల్లో తీవ్రమైన చర్చ సాగుతున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం అర్ధరాత్రి నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించగా.. పార్టీలోని గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. చారిత్రక ఖిల్లా ప్రాంతంలోని దాశరథి కృష్ణామాచార్యులు బస చేసిన ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎదుటే ఎంపీ అర్వింద్‌ వర్సెస్‌ యెండల లక్ష్మీనారాయణ వర్సెస్‌ ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా మూడు గ్రూపుడలు కనిపించడం ముక్కున వేలేసుకునేలా చేసింది.

దాశరథి వ్యాఖ్యలకు వక్రభాష్యం.. 

తెలంగాణ ప్రాంతంలో ఏ మూలకు వెళ్లినా దాశరథి కృష్ణామాచార్యుల వారి ‘నా తెలంగాణ - కోటి రతనాల వీణ’ నినాదాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. స్వరాష్ట్రంలో తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో మన వైతాళికుల గొప్పతనం ఉండడంతో ఒకటో తరగతి పిల్లాడు అయినా చక్కగా వివరిస్తారు. అలాంటిది భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు ఏకంగా చారిత్రక నినాదాన్ని కించపరిచేలా నోటికొచ్చినట్లుగా పలకడం అందరినీ ఆవేదనకు గురి చేసింది. జైలు గోడలపై దాశరథి కృష్ణమాచార్యులు స్వయంగా బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ - కోటి రతనాల వీణ’ను బీజేపీ నిజామాబాద్‌ జిల్లా సారథి మాత్రం ‘నా కోటి వీణ, తెలంగాణ వీణ’ అని పలికారు. నాలిక కర్చుకుని రెండోసారి సరిదిద్దుకునే ప్రయత్నంలో ‘నా కోటి తెలంగాణ రతనాల సీమ’ అంటూ పలకడం విడ్డూరం. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముంగిటే పరిపరి విధాలుగా చారిత్రక నినాదం అపహాస్యం పాలైంది. పక్కనున్న వారెవ్వరూ సరిచేసే ప్రయత్నమూ చేయకపోవడం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

రాష్ట్ర అధ్యక్షుడి ముందే బయట పడ్డ గ్రూపులు.. 

బీజేపీ రాష్ట్ర పగ్గాలను బండి సంజయ్‌ చేపట్టిన అనంతరం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల కూర్పు జరిగింది. నెల రోజుల క్రితం రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్ష పదవి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ లీడర్‌ యెండల లక్ష్మీనారాయణకు దక్కింది. దీంతో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వర్గం ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయగా యెండలకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఎంపీ వర్గానికి చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా నర్సయ్యపై బహిరంగంగానే యెండల ఘాటుగా విమర్శలు సైతం చేశారు. ఇలా రెండు గ్రూపుల మధ్య నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొనగా బండి సంజయ్‌ పర్యటనలో ముచ్చటగా మూడో వర్గం తెర పైకి వచ్చినట్లుగా కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆశించి భంగపడిన వ్యాపారవేత్త ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలో తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు బుధవారం రాత్రి సూరన్న అనుచర వర్గం పెద్ద ఎత్తున నినాదాలకు దిగడం చర్చకు దారి తీస్తున్నది. ఆ నినాదాలపై బండి సంజయ్‌ ‘తమాషాగా ఉందా?’ అంటూ ఒక దశాలో కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడగా నిజామాబాద్‌ జిల్లా బీజేపీ నేతలంతా కంగుతిన్నారు. బీజేపీ కార్యకర్తలను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మందలిస్తున్న వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరలవ్వగా ప్రజలంతా కలమం పార్టీ పరిస్థితిపై సెటైర్లు వేసుకుంటున్నారు.


logo