శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Kamareddy - Aug 12, 2020 , 02:54:45

వర్సిటీకి పచ్చల హారం

వర్సిటీకి పచ్చల హారం

  • పచ్చదనంతో తెలంగాణ విశ్వవిద్యాలయం కనువిందు
  • దారులన్నీ హరితమయం
  • మొక్కల సంరక్షణలో సిబ్బంది
  • వీసీ, రిజిస్ట్రార్ల ప్రత్యేక చొరవ

డిచ్‌పల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతి సంవత్సరం లక్ష్యానికి మించి మొక్కలు నాటుతున్నారు. 577 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఎటు చూసినా పచ్చని చెట్లే దర్శనమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటుతూ సిబ్బంది ఆదర్శంగా నిలుస్తున్నారు. నాటిన మొక్కల సంరక్షణకు వీసీ, రిజిస్ట్రార్లు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. విశ్వవిద్యాలయం ప్రధాన గేటు నుంచి మొదలుకొని పరిపాలన భవనం, ఆర్ట్స్‌ కళాశాల, సెంట్రల్‌ లైబ్రరీ, లా కళాశాల, కంప్యూటర్‌ సైన్స్‌ బిల్డింగ్‌, వసతిగృహాల రోడ్డు అంతా హరితహారం మొక్కలతో కనువిందు చేస్తోంది. కామర్స్‌ బిల్డింగ్‌ రోడ్డుకు ఇరువైపులా, వర్సిటీ ప్రధాన గేటు నుంచి సెంటర్‌ డివైడర్‌లో ఉన్న మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితహారంలో భాగంగా ప్రతీ సంవత్సరం మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. అప్పటి వీసీ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పార్థసారథి, వీసీ సాంబయ్య, అనిల్‌కుమార్‌ ఐఏఎస్‌, నీతూప్రసాద్‌ ఐఏఎస్‌, పూర్వ రిజిస్ట్రార్లు రిక్క లింబాద్రి, శివశంకర్‌, బలరాములు, ప్రస్తుత రిజిస్ట్రార్‌ ఆచార్య నసీమ్‌ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు పెరిగి వనంలా మారింది. ఐదేండ్లలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను టీయూ సిబ్బంది సంరక్షిస్తూ వస్తున్నారు. దీంతో విశ్వవిద్యాలయ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, రహదారి మధ్యలో రకరకాల మొక్కలు ఉన్నాయి. వివిధ కోర్సుల్లో బోధన ఒక్కటే కాదు, వందలాది మంది ఉండే విశ్వవిద్యాలయానికి ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం ఎంతో అవసరం. అలా ఉన్నప్పుడే మనసుకు నచ్చిన విద్యను అభ్యసించేందుకు వీలవుతుందన్న అధికారుల ఆలోచన మంచి ఫలితాన్నిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఆలోచనా విధానాలకు అనుగుణంగానే విశ్వవిద్యాలయంలో పచ్చదనం కోసం అధికారులు పాటుపడుతున్నారు. హరితహారంలో భాగంగా వర్సిటీలో ఇప్పటి వరకు లక్ష్యానికి మించి మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో వరుణదేవుడు కరుణించకపోయినా అధికారులు జిల్లా కేంద్రం నుంచి ఫైర్‌ ఇంజిన్‌ను తెప్పించి మొక్కలకు నీరందించారు. టీయూలో సామాజిక అటవీ సంరక్షణ, డ్వామా ఆధ్వర్యంలో దాదాపు 50 వేల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. అంతకు ముందు వర్సిటీలో ప్రారంభం నుంచి నాటిన మొక్కలను సంరక్షించేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు. ప్రధానంగా పరిపాలన భవనం ఎదుట ఏర్పాటు చేసిన ఆకుపచ్చ లాన్‌ కనువిందు చేస్త్తోంది. ఆర్ట్స్‌ కళాశాల భవనం ఎదుట సుమారు 20 రకాల మొక్కలను నాటారు.

ఈ యేడు 5,500 మొక్కలు..

ఈ యేడు హరితహారం కార్యక్రమంలో భాగంగా టీయూలో 5,500 మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ రిక్క లింబాద్రి ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని ఇటీవల అట్టహాసంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 

లక్ష్యాన్ని అధిగమించాం..

తెలంగాణ విశ్వవిద్యాలయంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటాలన్నదే మా సంకల్పం. ప్రతి యేటా ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యానికి మించి మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. ఈ మహాయజ్ఞంలో మాతోపాటు విద్యార్థులు, అధ్యాపకులు భాగస్వాములు కావడం గొప్ప విషయం. భవిష్యత్తులో విశ్వవిద్యాలయంలో ఎక్కడ చూసినా మొక్కలే దర్శనమిచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

-నసీమ్‌, రిజిస్ట్రార్‌, టీయూ

మెయిన్‌ క్యాంపస్‌లో మొక్కల కనువిందు

తెలంగాణ విశ్వవిద్యాలయం ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. ప్రధానంగా ఆర్ట్స్‌ కళాశాల ఎదుట మొగళి, ఉసిరి, మామిడి, ఎర్ర తురాయి, కానుగ, వేప, మందారం, పత్తిరాగి, నందివర్దనం, మర్రి, రామబాణం, గులాబీ, బాదం, అలమంద, రణపాల, సంపెంగ, ఎదురు కలబంద, నల్లేరు, కొబ్బరి,  కాలజముడు, తులసి, నాగజముడు, గంగరావి, తీగ సంపెంగ, గన్నేరు, రేగు, టేకు వంటి మొక్కలను నాటారు. వాటిని నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. logo