గురువారం 26 నవంబర్ 2020
Kamareddy - Aug 11, 2020 , 01:09:06

ఎస్సారెస్పీలోకి భారీగా వరద

ఎస్సారెస్పీలోకి భారీగా వరద

మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 36 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్‌లోకి భారీగా వరద వస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఇన్‌ఫ్లో భారీగా వచ్చింది. రోజు రోజుకు ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో ప్రాజెక్టులు, బ్యారేజ్‌లు నిండుకుండలా మారాయి. దీంతో మిగులు జలాలు దిగువన ఉన్న ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 38 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద భారీగా వస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం మూడు టీఎంసీలకుపైగా పెరిగే అవకాశం ఉంది. 

ఎస్సారెస్పీ ఎగువన భారీ వర్షాలు 

ఎస్సారెస్పీ ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. 36 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కాకతీయ కాలువకు 1500 క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 600, లక్ష్మి కాలువకు 100, అలీసాగర్‌కు 360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్‌ భగీరథ తాగు నీటి అవసరాలకు 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. 430 క్యూసెక్కులు ఆవిరి, లీకేజీ రూపంలో పోతోంది. ప్రాజెక్టు నుంచి మొత్తం 3,142 క్యూసెక్కుల పోతోంది. ఈ సీజన్‌లో రిజర్వాయర్‌లోకి 23 టీఎంసీల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు)కాగా సోమవారం సాయంత్రానికి 1074.40 అడుగులు (38.309 టీఎంసీల) నీటి నిల్వ ఉందని డీఈ జగదీశ్‌ తెలిపారు.