గురువారం 22 అక్టోబర్ 2020
Kamareddy - Aug 05, 2020 , 01:58:56

మందుల దందాపై కొరడా..

మందుల దందాపై కొరడా..

  • nప్రకంపనలు సృష్టిస్తున్న ‘నమస్తే’ కథనం
  • nమెడికల్‌ షాపుల్లో  ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు
  • nకొవిడ్‌ -19 మందుల నిల్వ, అమ్మకం, అధిక ధరలపై పరిశీలన
  • nపలు మెడికల్‌ షాపుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా చికిత్సకు సంబంధించిన ఔషధాలను ఇష్టారీతిన అధిక ధరలకు అమ్ముతున్న వైనంపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. సోమవారం జిల్లా టాబ్లాయిడ్‌లో వచ్చిన ‘కొవిడ్‌ బూచి... దవా... దగా...’కథనం ఆధారంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు పలు మెడికల్‌ దుకాణాలపై మంగళవారం దాడులు నిర్వహించారు. ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకురాలు రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌, రూరల్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ హేమలత, కామారెడ్డి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత కలిసి తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మొత్తం 8 మెడికల్‌ షాపుల్లో కొనసాగిన తనిఖీల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది. పలు షాపుల్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. విటమిన్‌ సి, జింకోవిట్‌ టాబ్లెట్స్‌ ధరల తేడాలపైనా వివరాలు ఆరా తీశారు. వైద్య పరికరాల అమ్మకాలు, వాటికి సంబంధించిన ధరల పట్టికపై వివరాలు సేకరించారు.

ఔషధ దుకాణాలకు నోటీసులు

ఔషధ నియంత్రణ శాఖ అధికారుల దాడుల్లో పలు మెడికల్‌ దుకాణాల్లో నిబంధనలు పాటించడం లేదని తేలింది. ఇందులో భాగంగా ఆయా దుకాణాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మొత్తం ఎనిమిది ఔషధ దుకాణాల్లో తనిఖీలు చేపట్టగా ఐదు షాపుల్లో లోపాలు బహిర్గతమయ్యాయి. కీలకమైన కొవి డ్‌ 19 సమయంలోనూ మెడికల్‌ షాఫు నిర్వాహకులు చట్ట వ్యతిరేకంగా సాధారణ వ్యక్తులతో పని చేయించుకుంటున్నట్లుగా స్పష్టమైంది. వాస్తవానికి మెడికల్‌ దుకాణాల్లో పని చేసే వ్యక్తులు సంబంధిత విద్యార్హతను కలిగి ఉండాలి. ఫార్మాసిస్టుగా గుర్తింపు పొందిన వారు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నమైన పరిస్థితి నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మెడికల్‌ షాపుల్లో కనిపించడం గమనార్హం. కొవిడ్‌ -19 మందుల విక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలని లేకపోతే కఠిన చర్యలుంటాయని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు హెచ్చరించారు. ఫ్యాబిఫ్లూ, రెమిడిసివిర్‌ వంటి ఔషధాలను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే అమ్మాలని మెడికల్‌ షాపు యజమానులను ఆదేశించారు. కరోనా టెస్టు ఫలితం, ఐడీ ప్రూఫ్‌, డాక్టర్‌ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌, దవాఖానకు సంబంధించిన ఆమోద ముద్ర వంటివి ఉంటేనే కరోనా మందులు విక్రయించాలని స్పష్టం చేశారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలతో మెడికల్‌ షాపుల నిర్వాహకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.logo