సోమవారం 21 సెప్టెంబర్ 2020
Kamareddy - Aug 05, 2020 , 01:59:09

నియంత్రిత సాగులో కాద్లాపూర్‌ కథానాయకులు

నియంత్రిత సాగులో కాద్లాపూర్‌ కథానాయకులు

  • lప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పంటల సాగు
  • lడిమాండ్‌ ఉన్న పంటల సాగే లక్ష్యంగా రైతుల ముందడుగు
  • lఆశాజనకంగా వానకాలం పంటలు

బాన్సువాడ రూరల్‌ : రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా.. రైతులు ఆర్థిక ప్రగతివైపు అడుగులు వేస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రిత సాగు విధానం రైతుల పాలిట వరంలా మారింది. ఈ ఏడు వానకాలంలో సాగు చేయాల్సిన పంటలపై వ్యవసాయాధికారులు విస్తృత అవగాహన కల్పించారు. బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్‌ గ్రామం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన కాద్లాపూర్‌ రైతులు నియంత్రిత విధానంలో పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలిస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేసేలా రైతులను ఏకతాటిపైకి తేవడంలో సర్పంచ్‌ భాస్కర్‌ విశేష కృషి చేశారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయాధికారులతో అవగాహన కల్పించారు. దీంతో రైతులు నియంత్రిత సాగు ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం సూచించిన పంటలు వేశారు. గ్రామంలో వరి మినహా వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. వేసిన పంటలు ప్రస్తుతం ఆశాజనకంగా ఉండడం, వర్షాలు సైతం సమృద్ధిగా కురుస్తుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

డిమాండ్‌ ఉన్న పంటల సాగు..

ప్రభుత్వం సూచించిన నియంత్రిత సాగు విధానాన్ని కద్లాపూర్‌ గ్రామస్తులు తూచా తప్పకుండా పాటిస్తూ డిమాండ్‌ ఉన్న వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. నీటి లభ్యత తక్కువ ఉండగా, ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ పంటలను సాగు చేస్తున్నారు. పత్తి, మక్కజొన్న, సోయా, కంది, మినుము, పెసర తదితర పంటలను సాగు చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే దుక్కిదున్ని భూమిని సిద్ధం చేసుకున్నారు. వర్షాలు ప్రారంభం కాగానే విత్తనాలు వేశారు. దీంతో పంటలకు చీడ పురుగుల బెడద లేదు. క్రమంగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు నీటి ఇబ్బంది లేదు.  

నియంత్రిత సాగు విధానంతో మేలు 

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌ సారుకు ధన్యవాదాలు. మంచి డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేసుకోవాలని ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రిత సాగు విధానంతో మాకు మేలు జరుగనుంది. డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయడంతో పంట చేతికి రాగానే అమ్మడానికి ఇబ్బందులు ఉండవు. మంచి ధర వస్తే ఎవరికైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. మంచి ధరకు అమ్ముకోవడంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు.

-ఖలీల్‌, రైతు, కాద్లాపూర్‌

రైతులకు అవగాహన కల్పించాం 

నియంత్రిత సాగుపై వ్యవసాయశాఖ అధికారులతోపాటు గ్రామానికి చెందిన రైతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పంటల సాగుపై అవగాహన కల్పించాం. డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తే మంచి లాభాలు పొందొవచ్చని రైతులకు సూచించాం. రైతులు నియంత్రిత పంటల సాగుకు ముందుకొచ్చారు. గ్రామంలో పత్తి, మక్కజొన్న, సోయా, కంది, పెసర, మినుము తదితర పంటలను సాగు చేస్తున్నారు.

-భాస్కర్‌, సర్పంచ్‌, కాద్లాపూర్‌logo