బుధవారం 23 సెప్టెంబర్ 2020
Kamareddy - Aug 04, 2020 , 02:33:23

సకల వసతుల సమాహారంగా గ్రామాలు

సకల వసతుల   సమాహారంగా గ్రామాలు

  • lఅభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న పల్లెలు
  • lమౌలిక సదుపాయాల కల్పనతో మారిన రూపురేఖలు
  • lజీపీ అవసరాలు తీర్చేందుకు అందుబాటులోకి ట్రాక్టర్‌
  • lడంపింగ్‌యార్డులతో   చెత్త సమస్యకు చెక్‌
  • lనర్సరీల ఏర్పాటుతో     స్థానికంగా మొక్కల పెంపకం
  • lవైకుంఠధామాల నిర్మాణంతో చింత లేకుండా  అంతిమసంస్కారాలు

పల్లె రూపు మారుతోంది. మౌలిక వసతులు సమకూరుతున్నాయి. అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజీలే కాదు ఇంకా అనేకం ఉన్నాయని ప్రజలకు తెలుస్తోంది. గతంలో దశాబ్దానికోసారి రోడ్డు వేసి ఇదే అభివృద్ధి అనిపించేవారు. కానీ స్వరాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో ప్రజల కండ్లకు కనిపిస్తున్నది. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్తుతోపాటు అనేక వసతులు సమకూరుతున్నాయి. సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. చెత్త తొలగించడం మొదలు, ఎవరైనా చనిపోతే అంతిమ వీడ్కోలు పలికేవరకు అన్ని వసతులు అందుబాటులో వచ్చాయి. దీంతో గ్రామాల రూపురేఖలు మారాయి. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, డంపింగ్‌ యార్డు, నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్‌ షెడ్డు ఇలా అనేక సదుపాయాలు సమకూరుతున్నాయి. దీంతో పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. -మోపాల్‌

చెత్తతో ఆదాయం

గ్రామాల్లో ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికుల కొరత తీవ్రంగా ఉండడంతో పల్లెల్లో చెత్త సమస్య తీవ్రంగా మారింది. గ్రామాల్లో కంపోస్ట్‌ షెడ్లు నిర్మిస్తే పేరుకపోయిన చెత్త మాయం కావడంతోపాటు పంచాయతీకి ఆదాయం చేకూరే అవకాశం ఏర్పడింది. ప్రతి గ్రామంలో 30 ఫీట్ల పొడవు, 23 ఫీట్ల వెడల్పు, రేకుల పైకప్పులతో షెడ్డును నిర్మిస్తున్నారు. ఆరు భాగాలుగా విభజించి ప్రత్యేక అర్రలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను ఇక్కడికి తెచ్చి నిల్వ చేస్తారు. సేకరించిన చెత్త నుంచి ప్లాస్టిక్‌ వస్తువులు, గాజు సీసాలు, ఇనుము, ఇతర పనికి రాని ముడిసరుకును వేరు చేసి షెడ్డులోపల ఏర్పాటు చేసిన వేర్వేరు అర్రల్లో వేస్తారు. అలా వేయడంతో భూమిలో త్వరగా కరిగిపోని హానికారకమైన చెత్తను వేరుచేయడంతోపాటు వాటిని విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఉపాధిహామీ పథకం ద్వారా రెండున్నర లక్షల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నారు. 

డంపింగ్‌ యార్డుతో ఎన్నో ఉపయోగాలు

ప్రభుత్వం ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసింది. జిల్లాలోని అన్ని చోట్లా డంపింగ్‌యార్డులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వురుగా సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. గ్రామ శివారులో 25 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పుతో రెండు మీటర్ల లోతు తవ్వి డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేశారు. చెత్తను తీసుకొవచ్చే ట్రాక్టర్లు, ఆటోలు డంపింగ్‌ యార్డులకు వెళ్లేలా అదనపు నిర్మాణాలు చేపడుతున్నారు. కంపోస్ట్‌ షెడ్డులో వేరు చేసిన తర్వాత మిగిలిన చెత్తను తీసుకొచ్చి ఈ డంపింగ్‌ యార్డులో వేస్తారు. చెత్త నిల్వల ఆధారంగా ఈ డంపింగ్‌ యార్డులో మట్టితో పూడ్చివేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఉపాధిహామీ పథకం ద్వారా రూ.లక్షా 75వేలతో ఒక్కో డంపింగ్‌ యార్డును నిర్మిస్తున్నారు. 

అంతిమసంస్కారాలకు ఇబ్బంది లేకుండా..

గ్రామాల్లో గతంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కనీస వసతులు ఉండేవి కావు. ప్రస్తుతం ఆ సమస్య తీరింది. ప్రతి గ్రామానికి ప్రభుత్వం వైకుంఠధామం నిర్మించింది. ప్రతి వైకుంఠధామంలో ప్రత్యేకమైన గద్దెలు, గదులు, దుస్తులు మార్చుకోవడానికి గదులు, బోరుపంపులు, నీటి ట్యాంకులు, కూర్చోవడానికి వీలుగా దిమ్మెలు తదితర సదుపాయాలు కల్పించారు.

ట్రాక్టర్‌తో అనేక ప్రయోజనాలు

ప్రస్తుతం అనేక గ్రామాల్లో చెత్తను తరలించేందుకు, మురికి కాలువల్లో పేరుకుపోయిన మురుగును తరలించేందుకు, వేసవిలో నీటిని సరఫరా చేసేందుకు, రోడ్లకిరువైపులా పిచ్చిమొక్కలను తొలగించేందుకు ట్రాక్టర్లను అద్దెకు తీసుకునే వారు. అద్దె చెల్లించేందుకు పంచాయతీ నిధులు భారీగా ఖర్చు చేసేవారు. ప్రస్తుతం ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ అందుబాటులోకి రావడంతో పంచాయతీలకు పల్లెప్రగతిలో భాగంగా అన్ని అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ట్యాంకర్‌ ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లను కొనుగోలు చేసిన పంచాయతీ పాలకవర్గాలు గ్రామంలో జరిగే ప్రతి పనికి వీటిని వినియోగిస్తున్నాయి. దీంతో పంచాయతీకి డబ్బు ఆదా ఆవుతోంది. 

నర్సరీల్లో మొక్కల పెంపకం

ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం నర్సరీని ఏర్పాటు చేసింది. గ్రామానికి అవసరమైన మొక్కలను నర్సరీలో పెంచుతున్నారు. గ్రామంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కార్యాలయాలు, పాఠశాలలు, రోడ్ల పక్కన, అటవీ ప్రాంతంలో నాటేందుకు అవసరమైన మొక్కలు ఈ నర్సరీల ద్వారా అందించనున్నారు. టేకు, కానుగ, చింత వంటి మొక్కలతోపాటు పూలు, పండ్ల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. ఇంటి పరిసరాల్లో పెంచుకునేందుకు అనువైన మొక్కలను సైతం నర్సరీల ద్వారా అందిస్తున్నారు.logo