గురువారం 22 అక్టోబర్ 2020
Kamareddy - Jul 26, 2020 , 02:02:15

ఆధునిక దేవాలయం ఆయకట్టు ఆనందం!

ఆధునిక దేవాలయం ఆయకట్టు ఆనందం!

  • nఎస్సారెస్పీ నిర్మాణానికి పునాదిరాయి పడి     నేటికి  57 ఏండ్లు 
  • nసమైక్య పాలనలో ఉదాసీనత..
  • nస్వరాష్ట్రంలో పూర్వ వైభవం
  • nకాలువల ద్వారా మూడు జిల్లాలకు సాగునీరు
  •  nఆయకట్టు రైతుల జీవితాల్లో వెలుగులు            నింపుతున్న   ‘పునరుజ్జీవం’

మెండోరా : ఉత్తర తెలంగాణ వరప్రదాయినీ, అన్నదాతల కలలను నెరవేరుస్తూ ఆధునిక దేవాలయంగా పిలువబడుతున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 57 ఏండ్లు పూర్తిచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణానికి పునాది రాయి పడింది ఈ రోజే.  1963 జూలై 26న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అప్పటి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును ఆయన ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టులో రానురానూ నీటి లభ్యత తగ్గిపోతూ వచ్చింది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది.   సీఎం కేసీఆర్‌, రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కృషితో ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఎస్సారెస్పీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది.  ఆయకట్టు రైతాంగానికి సంపూర్ణ భరోసా ఏర్పడింది.

ఎస్సారెస్పీ రూపకల్పన తీరిది

1944-49 కాలంలో మొట్ట మొదట లోయర్‌ గోదావరి వ్యాలీ అనే భారీ ప్రాజెక్ట్‌ నిర్మించాలనే లక్ష్యంతో దాదాపు 400 టీఎంసీలతో 40 లక్షలకు పైగా ఎకరాలను సస్యశ్యామలం చేయాలని అప్పటి నిజాం సర్కారు భావించి, సాంకేతిక నిపుణులతో రూపకల్పన చేయించింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన కుస్తాపూర్‌ వద్ద ఒక ప్రాజెక్ట్‌, నది వెంబడి మరో ఏడు కిలోమీటర్లు ముందుకు వచ్చాక పికప్‌ డ్యాం, కడెం నదిని అనుసంధానించి నిర్మించిన కడెం రిజర్వాయర్‌కు నీటి సరఫరా కోసం ఓ కాలువ నిర్మించాలని ( అదే ప్రస్తుతం సరస్వతీ కాలువ ) నిర్ణయించారు. అయితే నిజాం సర్కారు చేసిన నిర్ణయాలు, డిజైన్లు కాలగర్భంలో కలిసిపోయాయి. 1955-56లో ప్రాజెక్ట్‌ నిర్మాణ కోసం అప్పటి ప్రభుత్వాలు కొన్ని సవరణలతో కొత్త ప్రతిపాదనలు తెరమీదికి తెచ్చాయి. కొత్త ప్రతిపాదనలతో వచ్చిన ఈ ప్రతిపాదనలు మొదటి పంచవర్ష ప్రణాళికలోనే అమలు కావాల్సి ఉండగా కానీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో రూ.10.22 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. దీని ప్రకారం మొదటి దశలో పోచంపాడ్‌ వద్ద డ్యాం నిర్మాణం, 47 మైళ్లు పోడవుగల దక్షిణ కాలువ (ఇప్పటి కాకతీయ కాలువ)నిర్మాణం ఉన్నాయి. రెండో పంచవర్ష ప్రణాళికలో నిధుల కొరత ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాన్ని మళ్లీ నీరు గార్చింది. ఇలా అనేక అవాంతరాలతో ముందుకు సాగింది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత 1957లో అప్పటి ప్రభుత్వం మరో సర్వేకు ఆదేశించింది. బాల్కొండ మండలంలోని పోచంపాడ్‌ గ్రామంలో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు 1963లో ప్రకటించగా, నెహ్రూ ప్రధానమంత్రిగా ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ. 40.10 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. 1983లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. కానీ ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్న సమయంలో ప్రణాళికలు, ప్రాజెక్ట్‌ డిజైన్‌, కాలువల కిలో మీటర్లు మారి,  అంచనా వ్యయం పెరిగి రూ.1600 కోట్లకు చేరింది.

ఎస్సారెస్పీ ఆయకట్టు 

18 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల సరిహద్దుల్లో ఎస్సారెస్పీ నిర్మాణం చేపట్టారు. గోదావరి నది పురుడు పోసుకున్న 326 మైళ్ల దూరంలో సముద్రమట్టానికి 980 అడుగుల ఎత్తులో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1093 అడుగులు 112 టీఎంసీలు ( 175 చదరపు మైళ్ల విస్తీర్ణం).  కాకతీయ కాలువకు 9,11,800 ఎకరాలు, లక్ష్మి కాలువలతో 50 వేల ఎకరాలు (లిఫ్ట్‌లతో కలిపి), సరస్వతీ కాలువతో 35,375 వేల ఎకరాలకు, ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ లిఫ్ట్‌లతో 33,438 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. 

1978లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌గా నామకరణం

ఈ ప్రాజెక్టు మొదట పోచంపాడ్‌ ప్రాజెక్ట్‌గా పిలిచేవారు. పోచంపాడ్‌ గ్రామంలో గోదావరి నదీ తీరాన శ్రీరాముడు నడయాడినట్లు చెప్పుకుంటారు.దీంతో గ్రామంలో గోదావరి నదీ తీరాన శ్రీకోదండ రామాలయాన్ని కూడా నిర్మించారు. 1978 నవంబర్‌ 5న అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి పోచంపాడ్‌ ప్రాజెక్ట్‌తోపాటు కోదండ రామాలయాన్ని సందర్శించారు. అక్కడే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌గా నామకరణం చేశారు. అలాగే కాలువలకు వరంగల్‌ వరకు నీటిని అందించే కాలువకు కాకతీయ కాలువ, నిజామాబాద్‌ జిల్లాలో రైతులకు సిరుల పంటలు పండించే కాలువకు లక్ష్మి కాలువ, అదిలాబాద్‌ జిల్లా బాసర సరస్వతీ నిలయమైనందున ఆ జిల్లాకు నీరందించే కాలువకు సరస్వతీ కాలువగా నామకరణం చేశారు.

 ‘పునరుజ్జీవం’తో.. అన్నదాత ఆనందం

ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసుకున్నా ప్రాజెక్టు లక్ష్యాలకు అనుగుణంగా ఉపయోగపడుతోందనే పరిస్థితి గానీ, సంతృప్తి గానీ ఆయకట్టు రైతుల్లో కలుగలేదని కచ్చింతంగా చెప్పవచ్చు. ఎగువన మహారాష్ట్రలో గోదావరిలో నీటి లభ్యతకు ప్రతి ఏటా గ్యారంటీ లేక పోవడం..వెరసి ప్రాజెక్టు తరచూ ఎడారిలా మారడం..ఎస్సారెస్పీ దిగువనేమో ఏటా వందలాది టీఎంసీల నీళ్లు వృథాగా పోతుండడం ఇందుకు నిదర్శనం. ఇంతటి దయనీయ పరిస్థితులు ఉన్నా సమైక్య పాలనలో ప్రజాప్రతినిధులు పట్టించకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎస్సారెస్పీకి పూర్వ వైభవం తీసుకొచ్చి, ఆయకట్టు రైతులకు భరోసా ఇవ్వాలని సంకల్పించారు. ఎస్సారెస్పీకి దిగువన ఎక్కడో రెండు వందల కిలో మీటర్ల దూరంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించాలని నిర్ణయించారు. వరద కాలువ ద్వారా పెద్ద పెద్ద మోటర్లతో పంపు హౌస్‌లు నిర్మించి ఎగువకు వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి ఏటా 60 రోజుల పాటు అరవై టీఎంసీలు తరలించుకునేలా పునరుజ్జీవ పథకాన్ని నిర్మించారు. దీంతో రెండేండ్లుగా వరద కాలువను నిండుగా నింపి ఉంచుతున్నారు. దీంతో ఎస్సారెస్పీ పై భారం తగ్గగా, ఈ వానకాలం పంటలకు నీటి విడుదలకు 36 టీఎంసీల నీళ్లు ఉండడంతో ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది.


logo