సోమవారం 03 ఆగస్టు 2020
Kamareddy - Jul 13, 2020 , 03:01:04

పాడికి దన్ను

పాడికి దన్ను

బాన్సువాడ / కోటగిరి : కొవిడ్‌ సంక్షోభం నుంచి పాడి పరిశ్రమను గట్టెక్కించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న పాడి రైతులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం ద్వారా అవకాశం కల్పిస్తున్నది. ఇందులో భాగంగా సహకార డెయిరీలకు పాలు విక్రయించే పాడి రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య విజయ డెయిరీలకు నిత్యం పాలు విక్రయించే రైతులకు రుణాలు ఇచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతులు, పశుసంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పాడి రైతు కుటుంబాలకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పాడిరైతులు పశుసంవర్ధకశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో 17,036 మంది పాడి రైతులకు రుణాలు అందించేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విజయ డెయిరీ నుంచి 7,431 మంది, కరీంనగర్‌ డెయిరీ నుంచి 1,087 మంది పాడి రైతులకు, 8,518 మంది వ్యవసాయ పంట రుణాలు కలిగిన రైతులకు కలిపి మొత్తం 17,036 మంది పాడి రైతులకు రుణాలు అందించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 8,506 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్‌లోని సారంగాపూర్‌ డెయిరీలో 6,500 మంది పాడిరైతులు ఉన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన పాడిరైతులకు రుణాలు మంజూరు చేయనున్నారు. 

కిసాన్‌ క్రెడిట్‌కార్డు ఉంటేనే రుణం..

పాడి రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభు త్వం రుణ సదుపాయం కల్పిస్తున్నది. వ్యవసాయ రైతులకు ఇచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పాడి రైతులకు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ కార్డు ఉన్న ప్రతి రైతుకూ రుణం అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మండలాల వారీగా రుణాలు అందించేందుకు కలెక్టర్‌ నుంచి బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో పాడిరైతుకు రూ.లక్షా 60 వేల రుణ సదుపాయం కల్పించనున్నారు. ఈ సొమ్ము ద్వారా పాడి రైతులు అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది. వచ్చిన రుణాన్ని మేలుజాతి పశువుల కొనుగోలు, దాణా కొనుగోలు, పశువులకు వేసే గడ్డిని నరికే చాప్‌ కట్టర్‌ మిషన్‌, మేలుజాతి గడ్డి పెంచేందుకు వినియోగించుకోవచ్చు. తద్వారా ఆర్థిక ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. 9 శాతం వడ్డీపై రుణాలు అందిస్తారు. వీటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించనున్నారు. తీసుకున్న రుణాన్ని సంవత్సరంలోపు చెల్లిస్తే 3 నుంచి 4 శాతం వడ్డీ విధిస్తారు. 

దరఖాస్తు చేసుకోవడం ఇలా..

ఒక్కో పాడి రైతు రూ.లక్షా 60 వేల రుణం పొందేందుకు సంబంధిత పత్రాలను మండలంలోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీలోపు అందించాల్సి ఉంటుంది. రెండు ఫొటోలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, బ్యాంకులో పంట రుణం పొందిన బ్యాంకు ఖాతా బుక్కు జిరాక్సులను సంబంధిత పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో అందించాలి. 

అర్హులకే రుణాలు

పాడి రైతులు ప్రభుత్వం అందిస్తున్న రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే పాడి రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను బ్యాంకులకు పంపించాం. అర్హత ఉన్న పాడిరైతులను మండల పశువైద్యాధికారులు గుర్తించి బ్యాంకులకు సిఫారసు చేస్తారు. అనంతరం పాడిరైతులకు రుణం మంజూరవుతుంది.   - జగన్నాథాచారి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, కామారెడ్డి

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రుణ సదుపాయాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు పాడి మంచి ఆదాయ వనరు. ప్రభుత్వం అందిస్తున్న రుణంతో పాడి పశువులు కొనుగోలు చేసి మరింత ఆదాయం పొందవచ్చు. జిల్లాలోని పలు రకాల బ్యాంకుల నుంచి కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. మొదటి విడుతలో ప్రస్తుతం పాలు పోస్తున్న రైతులకు రుణాలు ఇస్తారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆసక్తి ఉన్న ఇతర రైతులకు కూడా రుణాలు అందిస్తారు.  


logo