మంగళవారం 11 ఆగస్టు 2020
Kamareddy - Jul 12, 2020 , 01:31:01

ఐదు రాష్ర్టాల్లో బాధితులు

ఐదు రాష్ర్టాల్లో బాధితులు

  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన ఘరానా మోసం
  •  స్కీం పేరిట టోకరాపై దర్యాప్తు
  •  కూపీ లాగుతున్న పోలీసులు
  • ప్రధాన నిర్వాహకుడి అరెస్టు 
  • మిగిలిన వారి కోసం గాలింపు

కామారెడ్డి: జిల్లాలో స్కీంల పేరిట అమాయక జనాన్ని మోసం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్కీం పేరిట ఓ సంస్థ వేలాది మంది అమాయకుల నుంచి రూ. వందల కోట్లలో వసూలు చేసి, బోర్డు తిప్పేసి మోసం చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ స్కీంలో మోసపోయిన వారిలో ఐదు రాష్ర్టాలకు చెందిన బాధితులు ఉన్నారు. స్కీం ప్రధాన నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేయడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ అనే వ్యక్తి కొందరితో కలిసి కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో మూడేండ్ల క్రితం రియల్‌ఎస్టేట్‌, ఆహార పదార్థాల ప్యాకింగ్‌, విక్రయం పేరిట స్కీం ప్రారంభించాడు. రూ.30 వేలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.10 వేల చొప్పున లక్ష రూపాయలు చెల్లిస్తామంటూ నమ్మించాడు. జిల్లా కేంద్రంతో పాటు కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, సిద్దిపేట, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాల్లో సైతం ఏజెంట్లను నియమించుకున్నారు. అమాయక ప్రజలను మాయ మాటలతో సంస్థలో సుమారు ఎనిమిది వేల మందిని సభ్యులుగా చేర్చుకొని పెట్టుబడి పెట్టించారు. ఇలా రూ.30 వేల నుంచి మొదలుకొని లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టించారు. సుమారు రూ. రెండు వందల కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అయితే పెట్టుబడి దారులకు చెల్లించాల్సిన డబ్బులు తిరిగి చెల్లించకుండా నిర్వాహకులు కాలయాపన చేస్తూ వచ్చారు. గత మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా నిర్వాహకులు తమ కార్యాలయాన్ని మూసివేశారు. అనుమానం వచ్చి ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ సీఐ జగదీశ్‌ ఆధ్వర్యంలో నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. నాలుగురోజుల క్రితం ప్రధాన నిర్వాహకుడు ఇస్మాయిల్‌ను అరెస్టు చేశారు. దీంతో తమ డబ్బులు తిరిగి వస్తాయోలేదోనని డిపాజిట్‌దారులు ఆందోళన చెందుతున్నారు.

అప్పులు చేసి పెట్టుబడి..

సంస్థ ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి చాలా మంది పెట్టుబడులు పెట్టారు. కొన్ని రోజుల పాటు పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బులు చెల్లించి నమ్మించారు. దీంతో ఎంతో మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని, భూములను తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించారు. మరికొంత మంది అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు.

విచారణ జరుపుతున్నాం..

స్కీం పేరిట టోకరా వేసిన ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేశాం. మిగతా వారి కోసం గాలిస్తున్నాం. బాధితులు ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పూర్తి విచారణ కొనసాగుతున్నది.  

-పట్టణ సీఐ జగదీశ్‌


logo