ఆదివారం 09 ఆగస్టు 2020
Kamareddy - Jul 08, 2020 , 02:47:36

కామారెడ్డి జిల్లాలో కలకలం..

కామారెడ్డి జిల్లాలో కలకలం..

ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం కలవరపెడుతున్నది. మంగళవారం ఒక్కరోజే 36 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. నిజామాబాద్‌లో 19, కామారెడ్డిలో 17 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక ఎస్సై, ఒక ప్రజాప్రతినిధి సైతం ఉన్నారు. పట్టణాలకే పరిమితమైన కేసులు పల్లెల్లోనూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. కామారెడ్డి జిల్లా పిట్లంలో  వైద్యుడికి, గాంధారి మండలంలో బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు కరోనా సోకడంతో వారు ఎవరెవరిని కలిశారనే వివరాలను వైద్య సిబ్బంది సేకరిస్తున్నది. స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నా ప్రజలు పట్టించుకోకపోవడంతోనే కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. 

కామారెడ్డి జిల్లాలో కలకలం.. 

విద్యానగర్‌ : కామారెడ్డి జిల్లాలో వరుసగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తున్నది. మంగళవారం ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయి. మండలాల వారీగా పాజిటివ్‌ నిర్ధారణ అయిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకొడప్‌గల్‌లో నాలుగు, బిచ్కుందలో రెండు, మద్నూర్‌లో మూడు, గాంధారిలో ఒకటి, కామారెడ్డిలో నాలుగు, బాన్సువాడలో రెండు, నిజామాబాద్‌ జిల్లా వర్ని( బాన్సువాడ నియోజకవర్గం) మండలంలో ఒక వలసదారుడికి కొవిడ్‌-19 నిర్ధారణ అయ్యిందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దని, కొన్ని నెలల పాటు ఫంక్షన్లు జరుపుకోవద్దని పేర్కొన్నారు. పరిశుభ్రత చర్యలు తీసుకోవాలన్నారు. 

నిజామాబాద్‌ జిల్లాలో 19 మందికి..  

ఖలీల్‌వాడి : నిజామాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేవ లం మూడు రోజుల వ్యవధిలోనే 39 కేసులు నమోదయ్యాయి. మంగళవారం తాజాగా 19 కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

బిచ్కుందలో 11కు చేరిన పాజిటివ్‌ కేసులు .. 

బిచ్కుంద : మండలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మండలంలో ఒకరితో ప్రారంభమైన కొవిడ్‌-19 మంగళవారం వరకు 11కు చేరుకున్నది. చెప్పుల దుకాణం యజమాని నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి అతడి నుంచి మరో ఆరుగురికి.. ఇలా సోకుతూ పాటిజివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన ఒక కారు డ్రైవర్‌కు, మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి మంగళవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మండల కేంద్రంలో ప్రతి రోజూ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. పారిశుద్ధ్యం లోపించకుండా ఎంపీడీవో ఆనంద్‌, ఎంపీవో మహబూబ్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు.

పిట్లంలో పలువురి హోంక్వారంటైన్‌..  

పిట్లం : పిట్లంలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన వైద్యసిబ్బంది సదరు వైద్యుడు నివాసం ఉండే కాలనీలోని ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. వారందరూ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఎవరూ బయటకు రావొద్దన్నారు. కాలనీలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 

కరోనా బాధితుడు ఐసోలేషన్‌కు.. 

గాంధారి : మండలంలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యాధికారులు అతడిని మంగళవారం హైదరాబాద్‌కు తరలించారు. సదరు ఉద్యోగి గాంధారిలో ఇంటిరి అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే వారిని వైద్యసిబ్బంది అప్రమత్తం చేశారు. కరోనా వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తి ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశాడనే వివరాలను సేకరిస్తున్నారు. గాంధారిలో తాజాగా మరో వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 


logo