ఆదివారం 09 ఆగస్టు 2020
Kamareddy - Jul 08, 2020 , 02:29:35

ఉద్యమంలా ఉమ్మడి జిల్లాలో హరితహారం

ఉద్యమంలా ఉమ్మడి జిల్లాలో హరితహారం

ఉమ్మడి జిల్లాలో ఆరో విడుత హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములవుతుండడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంటున్నది. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో 60 శాతం మొక్కలు నాటడం పూర్తి కావడంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 

ఎల్లారెడ్డి : హరితహారం కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ఉద్యమంలా సాగుతున్నది. కార్యక్రమం ప్రారంభమైన 12 రోజుల్లోనే 60 శాతం మొక్కలను నాటారు. జిల్లాలో శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో పాటు ముగ్గురు ఎమ్మెల్యే లు, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి నియోజక వర్గాల్లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనడంతో  ప్రజలు మరింత ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఆరో విడుతలో 65 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా  12 రోజుల్లో 40 లక్షల మొక్కలను నాటి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. హరితహారం కార్యక్రమాన్ని కలెక్టర్‌ శరత్‌తో పాటు, డీఆర్డీఏ, అటవీ శాఖ అధికారులు హరిత హారం కార్యక్రమాన్ని నిత్యం పర్యవేక్షిస్తుండడంతో జిల్లాలో కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. 

కరోనా నేపథ్యంలో ప్రతి ఇంటికీ ఔషధ గుణాల తులసీ...

హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ సారి ప్రతి ఇంటికీ ఔషధ గుణాలు ఉన్న కృష్ణ తులసి, లక్ష్మి తులసి మొక్కలను ప్రత్యేకంగా పంపిణీ చేస్తున్నారు.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తులసి మంచి ఔషధం గా పని చేస్తుందని గ్రామాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.  

జిల్లాలో 40 లక్షల మొక్కలు...

కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో కేవలం 12 రోజుల వ్యవధిలోనే 32 లక్షల 22వేల మొక్కలను నాటారు. హరితహారం కార్యక్రమంలో 65 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మాచారెడ్డి, నిజాం సాగర్‌, తాడ్వాయి, బాన్సువాడ, నాగిరెడ్డిపేట మండలాలు 80 శాతానికి పైగా మొక్కలు నాటి ముందు వరుసలో ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి లక్ష్యం  నిర్దేశించడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.  అటవీ శాఖ ఆధ్వర్యంలో 3 లక్షలకు పైగా  మొక్కలు నాటారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో లక్షా పది వేలకు పైగా మొక్కలు నాటారు. వీటితో పాటు పంచాయతీ రాజ్‌, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మరో ఐదు లక్షల వరకు మొక్కలను నాటారు.

మోర్తాడ్‌ : హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో పండుగలా సాగుతున్నది. ఏ గ్రామానికి వెళ్లినా గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం వంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఐదు విడుతలుగా చేపట్టిన హరితహారంలో గ్రామానికి 40వేల మొక్కలు నాటడం లక్ష్యంగా కొనసాగగా, ఆరో విడుత లో నాటిన మొక్కలన్నింటిని సంరక్షించాలన్న లక్ష్యంతో జిల్లాలో 82 లక్షల  మొక్కలు నాటడం లక్ష్యంగా సాగుతున్నది. గత నెల 25న జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలో 14,35,643 గుంతలను తవ్వగా, 10,25,078 మొక్కలను నాటారు. 

గ్రామానికో నర్సరీ 

ఐదు విడుతలుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి మండలం లో నర్సరీలు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి మొక్కలను  తీసుకెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం గ్రామస్తులకు ఆరో విడుతలో 365 రోజులూ మొక్కలు అందుబాటులో ఉండే విధంగా గ్రామాల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసింది. 

ప్రతి నర్సరీలో గ్రామ అవసరాలు, అక్కడి ప్రజల అభిప్రాయాల మేరకు నర్సరీల్లో మొక్కలను పెంచారు. గ్రామంలో ఎవరైనా  మొక్కలు నాటాలనుకుంటే నర్సరీ నుంచి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంటి పరిసరాల్లో నాటుకునేందుకు కృష్ణతులసి, మందా రం, మల్లె, గులాబీ తదితర మొక్కలను పెంచారు. ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరుగుతూ మొక్కలను పంపిణీ చేస్తున్నారు.

అవెన్యూప్లాంటేషన్‌

ప్రతి గ్రామంలో ప్రధాన రహదారులతో పాటు ఇతర దారులకు ఇరువైపులా మొక్కలు నాటించారు. నాటిన మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేయించారు. రహదారుల వెంట నాటే మొక్కలు పెద్దవిగా ఉండేలా చూసుకున్నారు. ఏడాది క్రితమే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచడంతో తొందరగా నాటుకునే అవకాశాలు ఉన్నాయి. నాటిన మొక్కలు చనిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆరో విడుత హరితహారాన్ని కొనసాగిస్తున్నారు. 

గ్రామ వనసేవకుల నియామకం 

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం లోటుపాట్లు తలెత్తకుండా నాటిన మొక్కల్లో 85శాతం రక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు గ్రామ వనసేవకులను నియమించారు. వీరు ప్రతి రో జు నాటిన మొక్కల వద్ద గడ్డిని తొలగించడం, ట్రీగార్డులను సరిచేయడం, నీటిని పట్టడం చేస్తుంటారు. ఈ విధంగా నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో బండ్‌ప్లాంటేషన్‌, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, ఖాళీ స్థలాల్లో, రోడ్ల వెంట నాటిన మొక్కలను వీరు సంరక్షిస్తుంటారు. 

ప్రకృతి వనాల ఏర్పాటు

గ్రామాల్లో పచ్చదనంతో పాటు గ్రామ సౌందర్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. ప్రతి గ్రామంలో ఎకరం స్థలంలో ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈపార్కు లో 4వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో పూలు, ఔషధ మొక్కలను నాటడంతో పాటు, నీడనిచ్చే చెట్లను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే జిల్లాలో పార్కుల ఏర్పాటుకు భూమిపూజలు సైతం చేశారు.

అధికారుల పర్యవేక్షణ

జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. మండలస్థాయి అధికారుల నుంచి  కలెక్టర్‌ వరకు గ్రామాలను సందర్శిస్తూ సూచనలిస్తున్నారు. logo