సోమవారం 13 జూలై 2020
Kamareddy - Jun 04, 2020 , 01:06:08

‘స్వచ్ఛ’ ప్రగతి..

‘స్వచ్ఛ’ ప్రగతి..

పల్లెలు స్వచ్ఛంగా మారుతున్నాయి.. పట్టణాలు, నగరాలు 

కొత్తరూపును సంతరించుకుంటున్నాయి.  రెండు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతితో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి చేపట్టగా  విజయవంతమైంది. పట్టణాలు, నగరాల్లో మంచి ఫలితాలు వచ్చాయి.  రానున్న వానకాలం సీజన్‌లో వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన ‘ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. మరోవైపు వారం రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన కార్యక్రమాలు 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను పర్యవేక్షిస్తుండగా.. ప్రజలు భాగస్వాములవుతున్నారు. 

-నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ వ్యాప్తంగా ఊరూవాడ అందంగా ముస్తాబవుతున్నది. గతంలో ఆదరణకు నోచుకోని ప్రాంతాలు ఇప్పుడు తెలంగాణ సర్కారు హయాంలో కొంగొత్త రూపునకు మారుతున్నాయి. జిల్లాలో ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్రమం తప్పకుండా రాష్ట్ర ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదలతో గ్రామాలు, పట్టణాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. పుష్కలంగా నిధులు ఉండడంతో పెద్ద ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమాలు సాగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన పల్లె ప్రగతి తొలివిడుత విజయవంతం కావడంతో.. అదే స్ఫూర్తిని రెండో విడుతలోనూ ప్రదర్శించారు. ఫలితంగా పల్లెలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ఇదే స్ఫూర్తితో అమలైన పట్టణ ప్రగతి దిగ్విజయం కావడంతో పట్టణాలు, నగరాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో వానకాలం సీజన్‌లో డెంగీ సమస్య మరింత ఇబ్బంది పెట్టనుంది. ముందస్తు అప్రమత్తతలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు ఉపాయంగా కేటీఆర్‌ పిలుపు అమలవుతున్నది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేసి పొంచి ఉన్న ముప్పు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ క్రతువులో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన స్పీకర్‌ తదితరులు భాగస్వామ్యం అవుతున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు భాగస్వాములు కావాలి

బాన్సువాడ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పట్టణాలు, పల్లెలను బాగు చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పల్లె ప్రగతి-1,2లో పారిశుద్ధ్యంతోపాటు మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా కొనసాగింది. అన్ని గ్రామాల్లోనూ సత్ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం నిధులతో పల్లెల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. గత పాలకులు తెలంగాణ ప్రాంత అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నది. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుండడంతో గ్రామాలు అభివృద్ధిబాట పడుతున్నాయి. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాం. వానకాలం సీజన్‌ ప్రారంభం నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాం. పనులకు ప్రజలు సహకరించాలి. పల్లె నుంచి పట్టణం వరకు చెత్త సేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 

-పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్‌

భావితరాల మేలు కోసమే ‘పల్లెప్రగతి’

డిచ్‌పల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ సర్కారుతోనే అభివృద్ధి మొదలైంది. కేసీఆర్‌ ప్రణాళికలతో పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతున్నారు. భావితరాల మేలు కోసమే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో పనులు పకడ్బందీగా జరిగితేనే ప్రగతి సాధ్యమవుతుంది. సర్పంచులు పల్లెప్రగతిని నిర్లక్ష్యం చేయవద్దు. స్వచ్ఛ గ్రామాలుగా అభివృద్ధి సాధించేందుకు అనుక్షణం కేసీఆర్‌ తపన పడుతున్నారు. రెండు విడుతల్లోనూ నిర్వహించిన పల్లెప్రగతితో గణనీయమైన మార్పు చోటు చేసుకున్నది. స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం తరఫున ట్రాక్టర్లను పంపిణీ చేశాం. గ్రామస్థాయిలో అధికారులు ప్రభుత్వంతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఇంటింటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ గ్రామం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరముంది. 

-బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే


చిత్తశుద్ధితో పాలుపంచుకోవాలి

ఆర్మూర్‌ : ప్రభుత్వం పల్లెల సమగ్ర అభివృద్ధి కోసం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గంలోని ఆర్మూర్‌, నందిపేట్‌, మాక్లూర్‌ మండలాల్లోని అన్ని గ్రామాల్లో రెండు విడుతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. మూడు మండలాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులతో చర్చించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. పల్లెప్రగతి స్ఫూర్తితోనే దేశంలోనే ఆదర్శ గ్రామమైన అంకాపూర్‌లో ‘మన ఊరు - మన వాడ’ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేశాం. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చేపట్టేలా నాయకులు, అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల ప్రగతికి విశేషంగా కృషి చేస్తున్నది. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలి.  -ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌

అవగాహనతోనే వ్యాధులను ఎదుర్కోవాలి

ఖలీల్‌వాడి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో అమలైన పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అన్ని పార్టీలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. కనీవిని ఎరుగని రీతిలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాం. ఆరేండ్ల పదవీకాలంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం మరొకటిలేదు. నిరంతరం సాగాలని ప్రజలు, రాజకీయ పార్టీలు కోరడం శుభపరిణామం. నిరంతరం ఉద్యమ తరహాలో సాగాల్సిన కార్యక్రమం ఇది. కరోనా సమయంలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజామాబాద్‌ నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలుచేస్తాం.

-బిగాల గణేశ్‌ గుప్తా, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే 

అభివృద్ధి పథంలో పల్లెలు

కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పల్లెలు అభివృద్ధిబాట పట్టాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పల్లెల్లో ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో వివక్షకు గురైన గ్రామాలు... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. గత పాలకులు పల్లెలను పట్టించుకోకపోవడంతో దశాబ్దాలుగా సమస్యలు పేరుకుపోయాయి. కొత్త జీపీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువైంది. రెండు విడుతల్లోనూ నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది. పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి.

-గంప గోవర్ధన్‌, కామారెడ్డి ఎమ్మెల్యే, విప్‌

పల్లెల రూపురేఖలు మారుతున్నాయ్‌.. 

బోధన్‌ : రెండు విడుతల్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో చాలా మార్పు వచ్చింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలతోపాటు పచ్చదనం కోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. రెండు విడుతలుగా కొనసాగిన పల్లె ప్రగతిలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. పంచాయతీలకు ట్రాక్టర్లు, వాటర్‌ ట్యాంకర్లు ఇచ్చాం. కొత్తగా డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. సీఎం కేసీఆర్‌ అద్భుత ఆలోచన ఫలితమే ఇదంతా. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ చూసినా శుభ్రత కనిపిస్తున్నది. వచ్చే వానకాలంలో సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది.

-మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌, బోధన్‌ ఎమ్మెల్యే


logo