ఆదివారం 12 జూలై 2020
Kamareddy - Jun 03, 2020 , 01:58:38

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి

కామారెడ్డి, విద్యానగర్‌ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని  స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించగా, స్పీకర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. ఎం దరో ఆత్మ త్యాగాల ఫలితంగా, తెలంగాణ ప్రజల పోరాటంతో సాధించుకు న్న రాష్ట్రం నేడు దేశంలోనే అన్ని రంగాల్లో  ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ర్టాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, రైతుబంధు, రైతుబీమా పథకాలతో ఎంతో మంది లబ్ధిపొందుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక అద్భుతమన్నారు. దిండి, పాలమూరు, సీతారామ సాగర్‌, భక్త రామదాసు, కోయిల సాగర్‌ తదితర ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. గోదావరి నీటితో బీడు భూములను సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. కాళేశ్వరం, గోదావరి, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజ క వర్గాల్లోని దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని తెలిపారు. మన నిధులను మన సంక్షేమం కోసమే ఖర్చు చేసుకుంటున్నామని అన్నారు. లాక్‌డౌన్‌లో పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రేషన్‌ షాపుల ద్వారా ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నెత్తురు చుక్క చిందకుండా శాంతి మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత పదిశాతం కూడా నెరవేర్చవన్నారు. కానీ కేసీఆర్‌ ఎన్నికల హామీలను నెరవేర్చడమే కాకుండా అదనంగా నూతన పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌలభ్యం కోసమే నూతన జిల్లాలు ఏర్పాటుచేసుకున్నట్లు తెలిపారు. అంతకుముందు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ పోరాట యోధులు చాకలి ఐలమ్మ, పోలీసు కిష్టయ్య, జయశంకర్‌ సార్‌, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, కలెక్టర్‌ శరత్‌, జుక్కల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, సురేందర్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే,అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంపత్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  జాహ్నవి, వైస్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గోపీగౌడ్‌, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


logo