శనివారం 11 జూలై 2020
Kamareddy - May 31, 2020 , 04:17:19

మత్తు నుంచి బయటపడకుంటే క్యాన్సర్‌ ముప్పు

మత్తు నుంచి బయటపడకుంటే క్యాన్సర్‌ ముప్పు

  • పొగాకు ఉత్పత్తులతో అనర్థాలు
  • వ్యసనపరులనే కాకుండా పక్కవారినీ బలి తీసుకుంటున్న వైనం
  • సులువుగా మానవచ్చంటున్న నిపుణులు
  • నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం

‘సిగరెట్‌ స్మోకింగ్‌ ఈజ్‌ ఇంజూరియస్‌ టు హెల్త్‌. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’.. అంటూ సినిమాకెళ్లిన ప్రతి సారీ తెరపై ముందుగా ఇదే ప్రకటన వస్తుంది. కానీ పొగరాయుళ్లకు ఇది కనీసం చెవికెక్కడం లేదు. మీరు చెప్పేది మీరు చెప్పండి.. మేం చేయాలనుకున్నది చేస్తాం.. అన్నట్లు ఇంటర్వెల్‌లోనే సిగరెట్‌ కాల్చేస్తుంటారు ధూమపాన ప్రియులు. పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడి జిల్లాలో ఏటా వందలాది మంది మృతిచెందుతున్నారు. మానేద్దామని అనుకున్నా ఈ వ్యసనం నుంచి బయటపడడంలేదు. కౌన్సెలింగ్‌, ట్రీట్‌మెంట్‌ ద్వారా అలవాటును మాన్పించవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వ్యసనపరులు ఇప్పటికైనా మత్తు వదిలితే వారికి, వారి కుటుంబానికి మంచిది. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ప్రత్యేక కథనం..

ఖలీల్‌వాడి : సిగరెట్‌ తాగడం ఒక ఫ్యాషన్‌గా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దీనికి బానిసవుతున్నారు. వారు అనారోగ్యం బారిన పడడంతోపాటు పక్కవారినీ బలి తీసుకుంటున్నారు. సిగరెట్‌ తాగే వారికన్నా పక్కన ఉండే వారికే ఎక్కువ రోగాలు చుట్టుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగ తాగకుండా రోగాలు తెచ్చుకునేవారిని పాసివ్‌ స్మోకర్స్‌ అంటారు. పొగ తాగేవారికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 13 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులకు బానిసై మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు సూచిస్తున్నాయి. దాదాపు 6 నిమిషాలకు ఒకరు బలవుతున్నారు. వీరిలో 50 నుంచి 60 లక్షల మంది పాసివ్‌ స్మోకర్స్‌ కావడం గమనార్హం. అమెరికాలో ఏటా 5 నుంచి 6 లక్షల మంది మృతిచెందుతుండగా, చైనాలో 12 లక్షల మంది, భారతదేశంలో 10 లక్షల మంది మరణిస్తున్నారంటే పొగాకు ఏవిధంగా ప్రజల ప్రాణాలను తోడేస్తుందో ఊహించవచ్చు. మనదేశంలో చనిపోతున్న పొగరాయుళ్లలో 20 శాతం మంది పురుషులు కాగా, 5 శాతం మంది స్త్రీలు ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 20వ శతాబ్దంలో వంద మిలియన్‌ మరణాలు కేవలం పొగాకు ఉత్పత్తులతోనే సంభవించే ప్రమాదముంది. హుక్కా, బీడీ, సిగరెట్‌, సిగార్‌, పైప్‌ స్మోకింగ్‌, ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌, గుట్కా, తంబాకు, పాన్‌ మసాలా, జర్దా, తోట వంటి వాటితో మరణాలు సంభవించే అవకాశముంది. పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా వాటి ద్వారా కలిగే వ్యాధులు, రోగాల కారణంగా ప్రజలు వైద్యానికి వెచ్చిస్తున్న మొత్తం అందుకు పదింతలు ఎక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులను నిషేధించలేక వాటి ద్వారా కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. 

పొగాకు క్యాన్సర్‌ కారకం

పొగ తాగేవారిలో శరీరంలోని చాలా భాగాలకు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముంది. నోటి క్యాన్సర్‌, స్వరపేటిక క్యాన్సర్‌, ఆహార వాహిక, జీర్ణాశయం, కిడ్నీ, క్లోమము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ప్రధాన మైనవి. పొగతాగడం ద్వారా ఊపిరితిత్తుల్లోని వాయునాళం, వాయుగోళం, రక్త నాళాల నిర్మాణం, వాటి పనితీరు దెబ్బతింటుంది. తద్వారా ఊపిరితిత్తుల్లో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. మనం నిత్యం పీల్చే గాలిలో దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరితే దీన్ని బయటకు నెట్టే విధానం కుంటుపడుతుంది. 

- డాక్టర్‌ రాజేశ్వర్‌,  ఛాతి, ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు


logo