మంగళవారం 26 మే 2020
Kamareddy - May 23, 2020 , 02:30:51

కూలిన బతుకులు

కూలిన బతుకులు

 గోడ కూలి ముగ్గురు దుర్మరణం

 పసికందుతో పాటు దంపతులు మృతి

 అనాథలుగా మారినముగ్గురు చిన్నారులు

 వర్ని మండలం తగిలేపల్లిలో ఘటన

తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం హాయిగా నిద్రలోకి జారుకున్నారు. వేకువజామున ఇంటి గోడ కూలడంతో పడుకున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం తరలించగా కుటుంబ పెద్ద మరణించగా మరో ముగ్గురు చిన్నారులకు డాక్టర్లు వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ సంఘటన వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో విషాదం నింపింది. 

రుద్రూర్‌ (వర్ని): నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం తగిలేపల్లిలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకున్నది. శుక్రవారం ఉదయం వేకువజామున గోడ కూలిన ఘటనలో తల్లీబిడ్డ మృత్యు ఒడిలోకి చేరారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ దవాఖానలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాణిగారి లక్ష్మి - శ్రీనివాస్‌ దంపతులకు నలుగురు సంతానం సాయికుమార్‌(1), సంజన, వైష్ణవి, కీర్తన. వీరందరూ లక్ష్మి తల్లి గంగామణితో కలిసి గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అందరూ కలిసి గురువారం రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున గంగామణి నిద్రలేచి వాకిలి ఊడుస్తున్నది. అదే సమయంలో ఇంటిగోడ ఒక్కసారిగా కూలింది. గమనించిన గంగామణి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పడుకున్న వారిపై పడ్డ ఇటుక పెల్లలను తొలగించారు. లక్ష్మి(35) ఆమె కొడుకు సాయికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌(38), సంజన, వైష్ణవి, కీర్తనను బోధన్‌లోని జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీనివాస్‌ను నిజామాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కీర్తన, సంజన, వైష్ణవి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో గోపీరాం, సీఐ అశోక్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి సంఘటన వివరాలు సేకరించారు. శ్రీనివాస్‌, లక్ష్మి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఆర్డీవో గోపీరాం వారిని శాంతింపజేశారు. 

పునాది లేకుండా గోడ నిర్మించడంతోనే.. 

లక్ష్మి - శ్రీనివాస్‌ దంపతులు రెండేండ్లుగా ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.  పునాది లేకుండా గోడను నిర్మించడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మి, శ్రీనివాస్‌ది ప్రేమ వివాహం అని, చద్మల్‌కు చెందిన శ్రీనివాస్‌ వివాహం అనంతరం తగిలేపల్లిలోనే ఉంటున్నారని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ జిల్లా దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి గోపాల్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు కరీం, నాయకుడు మేక వీర్రాజు, ఎస్సైలు రవీందర్‌, అనిల్‌రెడ్డి, మచ్చేందర్‌రెడ్డి సందర్శించారు.


logo