బుధవారం 03 జూన్ 2020
Kamareddy - Apr 08, 2020 , 02:44:21

కరోనా విజృంభన

కరోనా విజృంభన

నమస్తే తెలంగాణ యంత్రాంగం : ‘కరోనా’ రోజు రోజుకూ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. వైరస్‌ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. మంగళవారం కొత్తగా నిజామాబాద్‌లో 10, ఆదిలాబాద్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో మంగళవారం పలు ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు.  

భైంసాలో మూడు కాలనీలు కంటైన్‌మెంట్‌ జోన్లు

భైంసా పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో పట్టణంలోని కిసాన్‌గల్లీ, కుంట ఏరియా, పురాణాబజార్‌ను కంటైన్‌మెంట్‌ జోన్లుగా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ప్రకటించారు. కాలనీలతోపాటు బయటకు వెళ్లే రహదారులను పోలీసులు దిగ్బంధం చేశారు. పటిష్ట భద్రత మధ్య పర్యవేక్షిస్తున్నారు. 

ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దు 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇండ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సూచించారు. మంగళవారం భైంసా పట్టణంలోని కరోనా బాధితుడి ఇంటిని సందర్శించారు. అనంతరం కాలినడకన కిసాన్‌గల్లీలోని మహాదేవుని మందిరం సమీపంలో, పురాణాబజార్‌లో మైకు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా పాజిటివ్‌ వచ్చినందున భైంసా పట్టణాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించామని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఎవరెవరిని కలిశారో తెలుసుకొని, వారిని క్వారంటైన్‌కు తరలిస్తామని అన్నారు. ప్రజలు ద్విచక్ర వాహనాలపై బయటకు వస్తే కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్‌ చేస్తామని ఎస్పీ శశిధర్‌రాజు హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ తహసీల్‌ కార్యాలయంలో ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏఎస్పీ వెంకట్‌రాంరెడ్డి, డీఎస్పీ నర్సింగ్‌రావు, ఆర్డీవో రాజు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, తహసీల్దార్‌ నర్సయ్య ఉన్నారు.

ఆదిలాబాద్‌లో మరో పాజిటివ్‌ కేసు

ఆదిలాబాద్‌ జిల్లాలో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..కొత్తగా మరొకరు వైరస్‌ బారిన పడ్డారు. జిల్లా కేంద్రానికి చెందిన 70 ఏండ్ల వృద్ధురాలికి కరోనా వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం కేసుల్లో ఏడు జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమై పట్టణంలోని 19 వార్డులను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు చర్చించి జోన్లను ఏర్పాటు చేశారు. 3, 5, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 45, 46, 47 వార్డుల్లోని కాలనీలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా గుర్తించారు. logo