బుధవారం 03 జూన్ 2020
Kamareddy - Apr 01, 2020 , 01:58:56

పరిస్థితి అదుపులోనే ఉంది.. ఆందోళన వద్దు

పరిస్థితి అదుపులోనే ఉంది.. ఆందోళన వద్దు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధ్దన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్లు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండు జిల్లాల్లో కరోనా వైరస్‌ నియంత్రణ అదుపులోనే ఉందని, ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దని అన్నారు. కామారెడ్డి జిల్లాలో తొలి కరోనా కేసు దేవునిపల్లికి చెందిన 69 ఏళ్ల వృద్ధుడికి వచ్చినట్లు వెల్లడించారు.దేవునిపల్లిలో 3 కిలోమీటర్ల పరిధిలో 10వేల ఇండ్లు, 50వేల మంది ప్రజలను 105 బృందాలతో పరీక్షిస్తున్నట్లు మంత్రి వివరించారు.  మొత్తం జిల్లాలో 26 మందికి కొవిడ్‌ 19 పరీక్షలు జరుపగా.. ఇందులో 23 మందికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందన్నారు. ఒకరికి పాజిటివ్‌ రాగా.. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌కు కట్టుబడి మరికొన్ని రోజులు ప్రజలు ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాకు 1241 మంది విదేశాల నుంచి, 1044 మంది ఇతర రాష్ర్టాల నుంచి వచ్చారని, వారందరినీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంచినట్లు మంత్రి వెల్లడించారు.  ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నిత్యావసరాలు రెండు నెలలకు సరిపోయేంతగా నిల్వలు ఉన్నాయని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో  కొనుగోలు కేంద్రాలను 320కి పెంచబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. శనగ కొనుగోలు కేంద్రాలను 10 నుంచి 57కు, మొక్కజొన్న కొనుగోళ్లకు 32 నుంచి 109 సెంటర్లు, జొన్నల కొనుగోళ్లకు 6 కేంద్రాల నుంచి 25కు పెంచనున్నట్లు చెప్పారు. వలస కూలీ లు 4వేల మందిని గుర్తించి బియ్యం, నగదు పంపిణీ చేసినట్లు తెలిపారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, వైద్యారోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

మరో వారం పాటు ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం..

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: లాక్‌డౌన్‌ ముగిసే వరకు ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే కరోనా మహమ్మారిపై విజయం సాధించినట్లేనని రాష్ట్ర  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో  అధికారులతో నాలుగు గంటలపాటు  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన 3,480 మందిలో 2,200 మందికి పద్నాలుగు రోజుల హోం క్వారంటైన్‌ పూర్తయ్యిందని, ఎవరికీ వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదని అన్నారు. మిగిలిన 1200 మందికి వారం రోజుల్లో హోం క్వారంటైన్‌ పూర్తవుతుందన్నారు. కరోనా కట్టడి విషయంలో యంత్రాంగం చర్యలు భేష్‌ అని మంత్రి కొనియాడారు. జిల్లాలో మొత్తం 29 మందిని టెస్టుల కోసం హైదరాబాద్‌కు పంపించామని, 14 నెగిటివ్‌ రాగా.. మరో 14 మంది రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయని, ఒకటి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని, ముందు జాగ్రత్త చర్యగా వైద్య సేవలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 4 వెంటిలేటర్లు, 5 ఐసీయూ పడకలు సిద్ధంగా ఉంచామన్నారు. సమీక్షలో నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ పాల్గొన్నారు.


logo