బుధవారం 03 జూన్ 2020
Kamareddy - Mar 31, 2020 , 03:06:58

వలస కూలీలకు భరోసా..

వలస కూలీలకు భరోసా..

 నమస్తే తెలంగాణ యంత్రాంగం : లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ స్వస్థలాలకు కాలినడకన బయలుదేరిన మహారాష్ట్ర, బిహార్‌ రాష్ర్టాలకు చెందిన సుమారు 200 మంది కూలీలకు నిర్మల్‌ పోలీసులు దివ్యాగార్డెన్‌లో ఆశ్రయం కల్పించారు. ఎస్పీ శశిధర్‌రాజు కూలీలకు ఆహార పొట్లాలు, తాగునీరు అందజేశారు. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు కూలీలకు ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన కూలీలు స్వస్థలాలకు బయలుదేరగా, మహారాష్ట్రకు చెందిన అధికారులు తమ రాష్ట్రంలోకి అనుమతించకపోవడంతో తానూర్‌ మండలం బెల్‌తరోడ చెక్‌పోస్టు వద్ద నుంచి నాలుగు ప్రత్యేక లారీల్లో 400 మంది కూలీలను అధికారులు  బాసరలోని అతిథిగృహానికి తరలించారు. అక్కడి నుంచి ముథోల్‌లోని గురుకులానికి తరలించి ఆశ్రయం కల్పించారు. బిద్రెల్లి చెక్‌పోస్టు వద్ద నాందేడ్‌ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌జీ షెల్కే, బాసర తహసీల్దార్‌ శివప్రసాద్‌, ఎస్సై రాజు వలస కూలీల తరలింపు విషయమై చర్చించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ కూలీలకు  ఉమ్మడి నిజా మాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు.  

272 మందికి క్వారంటైన్‌..

నాలుగు జిల్లాల్లో సోమవారం 272 మందిని క్వారంటైన్‌కు తరలించారు.  నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లికి చెందిన వ్యక్తితో పాటు వర్ని మండలం వకీల్‌ఫారంలో ఓ బిహార్‌ కూలీని  సోమవారం అధికారులు క్వారంటైన్‌ శిబిరాలకు తరలించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లివచ్చిన నందిపేట్‌లోని బర్కత్‌పురాకు చెందిన దంపతులను అధికారులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన క్వారంటైన్‌కు తరలించారు. నాగిరెడ్డిపేట్‌ మండలంలోని జప్తిజాన్కంపల్లిలో 140 మందిని, నవీపేటలో 11 మందిని, రుద్రూర్‌ మండలంలోని రాణంపల్లిలో 12 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. మహారాష్ట్రలోని  అగ్రికల్చర్‌ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న  సుమారు 105 మంది విద్యార్థులను పోలీసులు  చాంద(టీ)లోని మైనారిటీ గురుకులంలో ఉంచారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ముగ్గురిని రిమ్స్‌కు తరలించారు. 


logo