బుధవారం 03 జూన్ 2020
Kamareddy - Mar 31, 2020 , 03:04:58

కరోనా కట్టడికి భారీగా విరాళాలు

కరోనా కట్టడికి భారీగా విరాళాలు

 నమస్తే తెలంగాణ యంత్రాంగం : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ అండగా నిలబడుతున్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వేత్తలు సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఆపత్కాలంలో ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.   

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని సింధు విద్యాలయం యజమానులు విఠల్‌వార్‌ జ్ఞానేశ్వర్‌ రావు సోమవారం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు లక్ష రూపాయల విరాళం చెక్కును బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌కు అందజేశారు. పిట్లంకు చెందిన జొన్న నవీన్‌రెడ్డి కుమారుడు జొన్న రుద్రాంశ్‌రెడ్డి తాను పోగు చేసుకున్న రూ.11,111 సీఎం సహాయనిధి కోసం పిట్లం తహసీల్దార్‌ సుధాకర్‌కు చెక్కు రూపంలో అందజేశారు.

లింగంపేట-2 ఎంపీటీసీ సభ్యురాలు షమీమున్నీసా బేగం తన ఒక నెల వేతనం సీఎం సహాయనిధికి విరాళంగా తహసీల్దార్‌ నారాయణకు అందించారు. 

నిర్మల్‌ జీఎస్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వరప్రసాద్‌ రూ.25వేలు, న్యూలోలం లిటిల్‌ స్కాలర్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌రెడ్డి రూ.25వేలు, భైంసా సాక్షి దవాఖాన డైరెక్టర్‌ నందకిశోర్‌, సిబ్బంది రూ.లక్ష, నిర్మల్‌కు చెందిన అంకిత్‌ సోనాలికా ట్రాక్టర్‌ షోరూం తరఫున రూ.లక్ష చెక్కు కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీకి అందించారు. కలెక్టర్‌ సహాయ నిధికి నిర్మల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు ఒక నెల మొత్తం వేతనం రూ.2 లక్షలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్‌కు అందించారు. 

ఆదిలాబాద్‌ పట్టణంలోని అయ్యప్ప సేవాసమితి రూ.81 వేల చెక్కును ఆ సంస్థ ప్రతినిధి వేణుగోపాల్‌, పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా ఉద్యోగుల రూ.36,823 చెక్కును ఎంపీటీసీ ప్రశాంత్‌ రెడ్డి కలిసి కలెక్టర్‌కు అందజేశారు. ఉట్నూర్‌కు చెందిన ఫర్టిలైజర్‌ యజమానులు సతీశ్‌, సుధాకర్‌ ఉట్నూర్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌కు రూ.11వేల చెక్కును అందించారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు తమ ఒక నెల వేతనం రూ. లక్షా 70 వేలకు సంబంధించి అంగీకార పత్రాన్ని తహసీల్దార్‌ స్వాతి, ఎంపీడీవో శ్రీనివాస్‌కు అందజేశారు. 

నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలంలోని సర్పంచులు తమ ఒక నెల వేతనం రూ.లక్షా 40 వేలు సహాయ నిధికి అందజేస్తున్నట్లు తీర్మాన పత్రాన్ని ఎంపీడీవోకు సర్పంచుల సంఘం మండలం అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, వర్ని శంకర్‌, మాధవ్‌రావు, గోపు సాయిలు అందజేశారు. ముప్కాల్‌కు చెందిన ముస్కు ముత్తెన్న రూ.21,501 చెక్కును తహసీల్దార్‌ జయంత్‌ రెడ్డికి అందజేశారు. డిచ్‌పల్లి మండలంలోని ఎంపీటీసీలు ఒక నెల వేతనం రూ.90 వేల అంగీకార పత్రాన్ని ఎంపీపీ గద్దె భూమన్న, వైస్‌ ఎంపీపీ శ్యాంరావు చేతుల మీదుగా ఎంపీడీవో మర్రి సురేందర్‌కు అంగీకార పత్రాన్ని అందజేశారు.  

ఒక నెల పింఛన్‌ అందజేసిన దివ్యాంగుడు.. 

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌కు చెందిన దివ్యాంగుడు మమ్మాయి లింగన్న తనకు వచ్చే ఒక నెల ఆసరా పింఛన్‌ రూ.3,016 విరాళంగా అందజేశాడు. ఈ మేరకు సర్పంచ్‌కు విరాళం డబ్బులను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.  


logo