శుక్రవారం 05 జూన్ 2020
Kamareddy - Mar 29, 2020 , 02:11:00

మనసున్న మారాజులు..!

మనసున్న మారాజులు..!

  • ఆహారం అందించి కొందరు.. విరాళాలతో మరికొందరు మానవత్వం చాటుతున్న వైనం
  • పేదలు, వలస కూలీలు,యాచకుల కడుపు నింపుతున్నది ఎందరో..
  • కరోనా మహమ్మారిపై పోరులో తమవంతు పాత్ర

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసర సేవలందించే సిబ్బంది తప్పితే మిగతా వారు బయట తిరిగే పరిస్థితులు లేవు. కిరాణాకొట్లు, మెడికల్‌ షాప్‌లు,  డెయిరీలు మాత్రమే  తెరిచి ఉంటున్నాయి. హోటళ్లు, టీస్టాళ్లు, ఫుడ్‌కోర్టులు, దాబాలు ఇలా సర్వం బంద్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో బయట గుక్కెడు తాగునీరు దొరకని పరిస్థితి ఉంది. ఇక ఆహారం లభ్యం కావడం గగనంగా మారింది. బతుకుదెరువు కోసం వచ్చి కొందరు, ఇతరత్రా పనుల మీద వచ్చిన వారు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. యాచకులు, పేదలు, అభాగ్యుల పరిస్థితి కడుదీనంగా మారింది. ఈ పరిస్థితుల్లో పలువురు ఆహారం, తాగునీరు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. మరికొందరు సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఇంకొందరు మాస్క్‌లు, గ్లౌస్‌లు అందజేస్తూ ఉదారతను చాటుతూ మనసున్న మారాజులు అనిపించుకుంటున్నారు.

నమస్తే తెలంగాణ యంత్రాంగం: భిక్షాటన చేసుకుంటూ జీవించేవారిపై బోధన్‌ పట్టణానికి చెందిన మార్వాడీ సమాజ్‌ కరుణ చూపించింది. పట్టణంలోని భిక్షుకులకు, బస్టాండ్లు, ఆలయాల వద్ద, రైల్వే స్టేషన్‌లో ఉండే అనాథల వద్దకు ప్రతి రోజూ ఉదయం వేళలో మార్వాడీ సమాజ్‌ ప్రతినిధులు వెళ్లి ఆహారాన్ని అందించి వారి ఆకలిని తీరుస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం తాము వారికి ఆహారం సరఫరా చేస్తామని వారు తెలిపారు.

బోధన్‌ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనిరుపేదలకు ఆహారం అందజేత

శక్కర్‌నగర్‌: బోధన్‌ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో వంటలు చేసి, పాకెట్ల ద్వారా పలువురు నిరుపేదలకు శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో చేసిన వంటలను పాకెట్లలో పార్సిళ్లు చేసి పలు వార్డుల్లో మోటార్‌ సైకిళ్ల్లపై వెళ్తూ నిరుపేదలకు టీఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు ఫిరోజ్‌ఖాన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. 

రిలయన్స్‌ మార్ట్‌ ఆధ్వర్యంలో...

రిలయన్స్‌ మార్ట్‌ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ చేశారు. శనివారం అంబేద్కర్‌ చౌరస్తాతో పాటు పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు, పోలీస్‌ సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రిలయన్స్‌ సూపర్‌ మార్ట్‌ సూపర్‌వైజర్‌ విక్టర్‌, సిబ్బంది దిలీప్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

అనాథల పాలిట ‘అమ్మా నాన్న’..

లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో బోధన్‌ పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారి పాలిట అమ్మానాన్న చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆపద్బాంధవుడిలా మారింది. ఆ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏలూరి వాసుబాబు ఆధ్వర్యంలో వలంటీర్లు పట్టణంలోని బస్‌షెల్టర్లు, రైల్వే స్టేషన్లు, ఆలయాల వద్దకు వెళ్లి అనాథలకు భోజనం పెడతూ ఆకలి తీరుస్తున్నారు.

జమాతుల్‌ ఉలేమా హింద్‌ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

విద్యానగర్‌: కామారెడ్డి పట్టణంలో జమాతుల్‌ ఉలేమా హింద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి  ఆధ్వర్యంలో శనివారం 300 మంది పేదలకు రూ.600 చొప్పున విలువ చేసే నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పున్న రాజేశ్వర్‌, కౌన్సిలర్‌ శివ, సయ్యద్‌ అజ్మత్‌ ఉల్లా, ఫారూఖ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

పులిహోర, తాగునీరు పంపిణీ

ఖలీల్‌వాడి: లాక్‌డౌన్‌తో నిజామాబాద్‌ నగరంలో చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి మంచాల శంకరయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ అండగా నిలుస్తున్నది. ఆ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు మంచాల జ్ఞానేందర్‌ పులిహోరా, తాగునీరు ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. శనివారం వినాయక్‌నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద 300 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐవోసీఎల్‌ సేల్స్‌ ఆఫీసర్‌ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.30 వేలు అందజేసిన ఎల్‌ఐసీ ఏజెంట్‌

ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్‌ మచ్చ రఘురాం మనసున్న మహారాజు అనిపించుకున్నాడు. కరోనాపై పోరుకు తనవంతు సాయంగా శనివారం ధర్పల్లి తహసీల్‌ కార్యాలయంలో రూ.30 వేల చెక్కును తహసీల్దార్‌ ఎస్‌.శ్రీధర్‌కు అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఉడతా భక్తిగా తనవంతు సాయం చేశానని రఘురాం పేర్కొన్నారు. రఘురాంను ఎంపీడీవో నటరాజ్‌, ఎస్సై పాండేరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, సర్పంచ్‌ ఆర్మూర్‌ పెద్ద బాల్‌రాజ్‌, ఎంపీటీసీ సుజావుద్ద్దీన్‌, నాయకుడు నజీర్‌ తదితరులు అభినందించారు.

సమాజ సేవలో బాంబే క్లాత్‌ హౌస్‌

విద్యానగర్‌: కామారెడ్డి జిల్లాకేంద్రానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు ఈ విపత్కర పరిస్థితుల్లో సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కామారెడ్డిలో బాంబే క్లాత్‌ హౌస్‌ యజమానితో పాటు ప్రముఖ వ్యాపారులు గబ్బుల బాలయ్య, శ్రీనివాసులు గ్లౌజ్‌లను పంపిణీ చేశారు. ఒక్కొక్కరు 5 వేల చొప్పున 15 వేల గ్లౌజులను విరాళంగా అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ మొత్తం గ్లౌజులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు వారు అందజేశారు. డ్యూటీ చేస్తున్న పోలీసులు, పేదలకు మాస్కులను, ఆహార ప్యాకెట్లను బాంబే క్లాత్‌ హౌస్‌ యాజమాన్యం నిత్యం అందజేస్తోంది. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ఏరియా దవాఖానకు వచ్చే నిరుపేదల ఆకలి తీర్చడానికి ఆహార పొట్లాలను అందిస్తున్నారు. వీరిని కలెక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, వెంకటేశ్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ అభినందించారు.

నవీపేట సర్పంచ్‌ ఔదార్యం

నవీపేట: మండల కేంద్రంలో పేదలకు శనివారం స్థానిక సర్పంచ్‌ ఆసోల్ల శ్రీనివాస్‌ అన్నదానం చేశారు. లాక్‌డౌన్‌తో పేదలతో పాటు యాచకులు బుక్కెడు అన్నం కోసం తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి కడుపు నింపేందుకు గాను  సర్పంచ్‌ ఆసోల్ల శ్రీనివాస్‌ మూడు రోజులుగా నిత్యం అన్నం ప్యాకెట్లు పంపిణీ చేస్తూ ఆకలి తీర్చుతున్నారు.

రూ.5వేల విరాళం అందజేత

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ నగరంలోని ఆర్యనగర్‌లో నివాసముంటున్న దివాకర్‌రావు సీఎం సహాయ నిధికి రూ. 5 వేల విరాళం చెక్కును స్థానిక కార్పొరేటర్‌ సౌజన్య రాజశేఖర్‌కు శనివారం అందజేశారు. కరోనా వైరస్‌ నియంత్రణకు తనవంతు సహాయంగా ఈ విళారాన్ని అందజేశానన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు స్వీయ గృహ నిర్బంధం పాటిస్తున్నామని తెలిపారు.

కరోనా బాధితులకు రూ. లక్ష విరాళం

నవీపేట : కరోనా బాధితులను ఆదుకునేందుకు గాను నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలకేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీఆర్‌ఎస్‌ జిల్లా  నాయకుడు భవంతి దేవీదాస్‌ తనవంతుగా శనివారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి రూ.1,00,116 చెక్కును  అందజేశారు.ఈ సందర్భంగా దాత భవంతి దేవీదాస్‌ మాట్లాడుతూ.. కరోనా బాధితులను ఆదుకునేందుకు గాను తన వంతుగా ప్రభుత్వానికి ఈ సహాయం చేసినట్లు తెలిపారు.

పొతంగల్‌ వాసి పెద్దమనసు

కోటగిరి: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కోటగిరి మండలం  పొతంగల్‌ మంజీర నది చెక్‌ పాయింట్‌ వద్ద పొతంగల్‌ నివాసి మహాజన్‌ బాలాజీ తనయుడు డీలర్‌ సందీప్‌ మహాజన్‌ భోజన ఏర్పాటు చేస్తున్నారు. చెక్‌పోస్టు వద్ద పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీ, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది సుమారు 80 విధులు నిర్వర్తిసుండగా.. వారికి సందీప్‌ మహాజన్‌ భోజనం అందిస్తున్నారు. ఆయనను రుద్రూర్‌ సీఐ అశోక్‌రెడ్డి, కోటగిరి ఎస్సై మచ్చేందర్‌రెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అభినందించారు.


logo