ఆదివారం 24 మే 2020
Kamareddy - Mar 16, 2020 , 02:08:48

పదికి సన్నద్ధం

పదికి సన్నద్ధం

పది పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నది. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పది పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 12,751మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,231 మంది బాలురు, 6,520 మంది బాలికలు ఉన్నారు. పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్‌ స్కాడ్స్‌, రూట్‌ ఆఫీసర్లు, సిట్టింగ్‌ స్కాడ్స్‌, 697 మంది ఇన్విజిలేటర్లు వీరితో పాటు 60 మంది చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, 60 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, 21 మంది కస్టోడియన్లు, 21 మంది జాయింట్‌ కస్టోడియన్‌ ఆఫీసర్లు నియమించారు.

  • షెడ్యూల్‌ ప్రకారమే వార్షిక పరీక్షలు
  • స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • హాజరుకానున్న 12,751 మంది విద్యార్థులు
  • జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాలు
  • ఏర్పాట్లలో జిల్లా విద్యాశాఖ నిమగ్నం

విద్యానగర్‌:  పదో తరగతి పరీక్షలు  పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కలవర పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పాఠశాలలకు ఈ నెల 16వ తేదీ నుంచి 31 వరకు సెలవులు ప్రకటించింది. పదోతరగతి పరీక్షలను మాత్రం నిర్దేశించిన తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా ఇన్విజిలేటర్లను, ఫ్లయింగ్‌ స్కాడ్‌లను, రూట్‌ ఆఫీసర్లను నియమించారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాలు ఉండగా 55 ప్రభుత్వ పాఠశాలలు, 5 ప్రైవేట్‌ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,751మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పదిలో వంద శాతం ఫలితలు సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని ఇప్పటికే కలెక్టర్‌ శరత్‌ విద్యా శాఖకు ఆదేశాలు, సూచనలు చేశారు. 

జిల్లా వ్యాప్తంగా 12,751 మంది విద్యార్థులు

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు అన్ని కలుపుకొని 12,751 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 6,231 మంది బాలురు, 6,520 మంది బాలికలు ఉన్నారు.185 జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలల్లో 7,908 మంది విద్యార్ధులు, 17 కేజీబీవీ పాఠశాలల్లో 743 మంది, 6 మోడల్‌ స్కూళ్లలో 579 మంది,13 తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 875 మంది, 2 ఎయిడెడ్‌ స్కూళ్లలో 53 మంది, 58 ప్రైవేట్‌ పాఠశాలల్లో 2,427 మంది విద్యార్థులు ఉన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద..

వేసవి దృష్టిలో పెట్టుకొని జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. విద్యార్థులకు తాగు నీరు, టాయిలెట్స్‌, వైద్య సిబ్బందిని నియమించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు, జిరాక్స్‌ సెంటర్ల మూసివేత, ప్రతి సెంటర్‌ వద్ద ఒక కానిస్టేబుల్‌ను నియమించనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. హిందీ పరీక్ష రోజు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అరగంట ముందు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. మొదటి రోజు మాత్రమే 9.35 నిమిషాల వరకు అనుమతి ఉన్నది కానీ మిగతా పరీక్షలకు 9.30 లోపు మాత్రమే అనుమతి కలదు. పరీక్షకు ఒక రోజు ముందుగా పరీక్ష కేంద్రాలను విద్యార్థులు సందర్శిస్తే పరీక్ష రోజు సులువుగా ఉంటుందని అధికారులు తెలిపారు.

మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా..

పరీక్షల్లో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు  ఫ్లయింగ్‌ స్కాడ్స్‌, రూట్‌ ఆఫీసర్లు, సిట్టింగ్‌  స్కాడ్స్‌, 697 మంది ఇన్విజిలేటర్లు వీరితో పాటు 60 మంది చీఫ్‌ సూపరింటెండెంట్స్‌, 60 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, 21 మంది కస్టోడియన్లు, 21 మంది జాయింట్‌ కస్టోడియన్‌ ఆఫీసర్లు నియమించారు. కలెక్టర్‌, జేసీ హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తారు. వీరితో పాటు రెవెన్యూ, పోలీస్‌, వైద్య, ఇతర విభాగాల నుంచి పరీక్ష నిర్వహణలో పాల్గొంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..

పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకుంటే ఇబ్బందులు ఉండవు. 

- రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి


logo