సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Mar 08, 2020 , 02:21:25

క్రూరమైన ‘మనిషి’..!

క్రూరమైన ‘మనిషి’..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పరువు కోసం తోడబుట్టిన అన్నను, అన్న కూతుర్ని, రక్తం పంచుకు పుట్టిన బిడ్డను కిరాతకంగా హతమార్చాడో దుర్మార్గుడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న తల్లి, కన్న బిడ్డ అనే తారతమ్యం లేకుండానే లైంగికదాడికి ఒడిగొట్టాడో ప్రబుద్ధుడు. తన కడుపున పుట్టిన బిడ్డనే తల్లిని చేసి సమాజంలో హేయమైన చర్యకు పాల్పడ్డాడో మూర్ఖుడు. కాపురంలో తలెత్తిన చిన్నపాటి చిక్కును పరిష్కరించుకోలేక భార్యను హతమార్చిన రాక్షసుడు ఇంకొకడు. ఆస్తి పంపకం విషయమై సాక్షాత్తు తోడబుట్టిన అన్ననే గొడ్డలితో నరికి చంపాడో దుర్మార్గుడు. జల్సాలకు భార్య డబ్బులు ఇవ్వలేదని పసిమొగ్గల్లాంటి ముగ్గురు కూతుళ్లను కర్కషంగా చెరువులో ముంచి చంపేశాడో తాగుబోతు తండ్రి. ఇలా చెప్పుకుంటూ పోతే గడిచిన ఏడాదిన్నర కాలంలో కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన అనేక ఘటనలు అంతరించి పోతున్న మానవ సంబంధాలు, బంధాలు, బంధుత్వాలకు మచ్చుతునకగా నిలుస్తున్నాయి. ఆదిమ జాతి నుంచి సంఘ జీవిగా రూపాంతరం చెందిన మనిషి చేస్తున్న ఆటవిక చర్యలతో అడవిలోని క్రూరమృగాలు సైతం తలదించుకునే పరిస్థితి వస్తుందంటే అతిశయోక్తి కాదు. తల్లి, బిడ్డ, భార్య, చెల్లి, అక్కా ఇలా ఏ పేరుతో పిలిచినా అనేక కేసుల్లో మగవారి చేతుల్లో సమిధలవుతున్నది మాత్రం ముమ్మాటికి స్త్రీ మూర్తులే కావడం అత్యంత విషాదకరం.


పతనమవుతున్న విలువలు...

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ పతనం అవుతున్నాయి. సాంకేతిక యుగంలో మనం ఎంతగా పురోగమిస్తున్నప్పటికీ బంధాలు, బాంధవ్యాల విషయంలో మాత్రం తిరోగమనం స్పష్టంగా కనిపిస్తున్నది. తల్లి, చెల్లి, భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, తండ్రి అనే బేధాలు లేకుండా పోతున్నాయి. రక్త సంబంధీకులను, కుటుంబ సభ్యులను తమ వాళ్లు అంతమొందించిన సంఘటనలు నెల లేదంటే రెండు నెలల్లో సగటున ఒకటి చొప్పున జరుగుతుండడం విడ్డూరం. ఘర్షణలు, గొడవల సంఖ్య ఏడాదిలో వందల సంఖ్యలో ఉంటున్నాయి. చిన్నపాటి విషయాలకే ఆవేశానికి లోనై తీరని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 

క్షణాల వ్యవధిలో తెంచుకుంటున్న ఆగ్రహావేశాలకు ఊహించని భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిలో యువత ఎక్కువగా ఉండడం బాధాకరం కాగా బాధితుల్లో అత్యధికులు మహిళలు, యువతులు, బాలికలు ఉండడం ఆందోళనకు గురి చేస్తున్నది. పైగా మద్యం మత్తు ప్రభావంతోనే ఇలాంటి హింసాత్మక ధోరణి జరుగుతున్నట్లు ఆయా సందర్భాల్లో పోలీసులు స్పష్టంగా ధ్రువీకరిస్తున్నారు. బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో శుక్రవారం వెలుగు చూసిన హృదయ విదారకర ఘటన ఇందుకు సాక్షాత్కరంగా నిలుస్తున్నది. 


logo