మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Mar 08, 2020 , 02:15:24

బ్యాంకులకు బారులు!

బ్యాంకులకు బారులు!

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రైవేటు రంగంలోని యెస్‌ బ్యాంకు పరిణామాలతో బ్యాంకు ఖాతాదారుల్లో వణుకు మొదలైంది. తమ డిపాజిట్లు, లాకర్లలో దాచిన విలువైన వస్తువులు, డాక్యుమెంట్లపై ఖాతాదారుల్లో ఆందోళన నెలకొన్నది. యెస్‌ బ్యాంకు దివాళా తీసిందని తెలియడంతో జిల్లాలో ఖాతాదారులు ప్రైవేటు బ్యాంకులపై ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు బ్యాంకులపైన ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు. యెస్‌ బ్యాంకు పరిణామాలతో మిగతా ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న తమ డిపాజిట్లపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితి ఏమిటని బ్యాంకులకు వస్తూ ఆరా తీస్తున్నారు. యెస్‌ బ్యాంకు ప్రభావంతో జిల్లాలో అన్ని ప్రైవేటు బ్యాంకులకు ఖాతాదారులు వచ్చి తమ డిపాజిట్ల భద్రత, లావాదేవీలపై ఆరాతీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకులకు ఖాతాదారుల తాకిడి పెరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద తదితర ప్రాంతాల్లో ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 


జిల్లా కేంద్రంలో పదికి పైగా ప్రైవేటు బ్యాంకుల శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా ప్రైవేటు బ్యాంకుల సేవలు సులభతరంగా, సౌకర్యంగా ఉండడంతో ఇటీవల కాలంలో ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఖాతాలు పెరిగాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు వాటిలోనే కొనసాగిస్తున్నారు. కాగా, తాజాగా ప్రైవేటు బ్యాంకుల పనితీరుపై ప్రజల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొన్నది. యెస్‌ బ్యాంకు పరిణామాలతో ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారు శాఖలకు పరుగులు తీస్తున్నారు. యెస్‌ బ్యాంకు ఖాతాదారుల డిపాజిట్లు భద్రంగా ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చినా.. ఖాతాదారుల్లో ఆందోళన మాత్రం వీడడం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో సేవలు ఆలస్యం కావడంతో, ఇటీవల కాలంలో చాలామంది ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తూ లావాదేవీలు కొనసాగిస్తున్నారు. డిపాజిట్లు చేస్తున్నారు. లాకర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం యెస్‌ బ్యాంకు మూతపడడంతో ప్రైవేటు బ్యాంకుల పనితీరుపై బ్యాంకు వినియోగదారుల్లో ఒక విధమైన అభద్రత నెలకొన్నది.  


logo
>>>>>>